Harish Rao: బీజేపీ ప్రతినిధిలా గవర్నర్, ఆమె మాటల్లో స్పష్టంగా రాజకీయం - హరీశ్ రావు వ్యాఖ్యలు
గవర్నర్ తీరు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గవర్నర్ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

వైద్యశాఖపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు విచారకరం అని ఆ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆమె ఉస్మానియా ఆస్పత్రి గురించి అలా మాట్లాడడం సమర్థనీయం కాదని అన్నారు. అసలు ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించి అయినా ఆమె మాట్లాడారా అంటూ నిలదీశారు. బుధవారం (జూన్ 28) మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ గవర్నర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని, అసలు ఆసుపత్రికి భవనం పనికిరాదని గతంలో నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయం తెలిపిందని, ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని 2015లోనే కట్టాలని సీఎం కేసీఆర్ అప్పుడే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కానీ దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారని చెప్పారు. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. కొత్త భవనం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఉస్మానియా డాక్టర్లు బాగా పని చేశారని కొనియాడారు. గవర్నర్‌కు వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆమె ఒక్కసారి కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు. వైద్య రంగంలో కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నామని చెప్పారు.
గవర్నర్ తీరు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గవర్నర్ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అనవసరంగా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని.. కంటి వెలుగులాంటి కార్యక్రమాన్ని మెచ్చుకునేందుకు గవర్నర్‌కి మనసు రాలేదని అన్నారు. నిమ్స్‌లో పడకల పెంపుపై ఆమె ఎందుకు స్పందించలేదని, కనీసం ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేదని అన్నారు. మాతా శిశుమరణాలు తగ్గించడంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ చెబితే గవర్నర్‌కు కనిపించదని అన్నారు. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడడం దురదృష్టకరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచి కనబడదు, వినబడదు అనే తరహాలో తమిళిసై వ్యవహారశైలి ఉందని అన్నారు. గవర్నర్ తీరులో రాజకీయమే స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
ప్రధాని మోదీ (PM Modi Comments) వ్యాఖ్యలపైనా స్పందన
మధ్యప్రదేశ్ లో ప్రధాని మోదీ కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలపైన కూడా హరీష్ రావు స్పందించారు. బీఆర్‌ఎస్ బలపడుతుందన్న భయంతోనే మోదీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని అన్నారు. కేసీఆర్ ఎవరి ఏజెంట్ కాదని.. రైతుల ఏజెంట్ అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎవరెన్ని సభలు పెట్టినా గెలిచేది బీఆర్‌ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర సభకు విశేష స్పందన వచ్చిందని, ఆదానీ బలపడాలంటే మోదీని గెలిపించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ ముందు అవేమీ చెల్లవని అన్నారు. తాము వద్దనుకున్న వారు, బహిష్కరించిన వారు మాత్రమే వేరే పార్టీలో చేరుతున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు.





















