BRS MLAs Meeting: మంత్రి మల్లారెడ్డి సన్నిహితులకే పదవులా, మా సంగతేంటి ? : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆవేదన
జిల్లాకు పదవులు ఇస్తామని పార్టీ పెద్దలు మాట ఇచ్చారని, కానీ జిల్లాకు రావాల్సిన పదవులు మొత్తం కేవలం మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే ఇస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఆరోపించారు.
మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశం రహస్య భేటీ కాదన్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్. చాలా రోజుల నుంచి జిల్లాకు చెందిన సీనియర్ నేత మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కలుద్దామని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చాలా రోజులనుంచి అనుకుంటున్నామని, ఈరోజు వీలైందన్నారు. తాము జీహెచ్ఎంసీ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేం అని, గతంలో జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలోనే ఎక్కువ స్థానాలు సాధించామన్నారు. జిల్లాకు పదవులు ఇస్తామని పార్టీ పెద్దలు మాట ఇచ్చారని, కానీ జిల్లాకు రావాల్సిన పదవులు మొత్తం కేవలం మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే ఇస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఆరోపించారు.
జిల్లా మొత్తానికి చెందిన ఓ పదవి సైతం ఇటీవల మేడ్చల్ నియోజకవర్గానికి ఇచ్చారని, టర్మ్ పూర్తి కాకముందే వేరే వారికి అవకాశం ఇచ్చారని చెప్పారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, కానీ రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి భాస్కర్ యాదవ్ తో ప్రమాణ స్వీకారం చేయించారని తెలిపారు. అయితే మంత్రి కేటీఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ఎలాంటి చర్చలు జరపలేదని, కొందరి ప్రభావంతో వేరే నేతలకు పదవులు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు తమ ఎమ్మెల్యేల సమావేశం లీక్ కావడంతో అసమ్మతి అని ఏదో ప్రచారం జరిగిందని, దానిపై క్లారిటీ ఇచ్చేందుకు మీడియాతో మాట్లాడామని చెప్పారు.
పార్టీ ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించిన పనులతో పాటు పదవులపై సైతం మంత్రులతో చర్చించే అవకాశం ఉందన్నారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. తాము మంత్రికి మార్కెట్ కమిటీ పదవికి సంబంధించి విషయం తెసుకెళ్లిన తరువాత సైతం తమతో సంప్రదింపులు జరపకుండా, ఫోన్ చేసి మాట్లాడకుండా ఇతరులకు పదవులు కట్టబెట్టడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. ప్రజలతో ఎన్నికైన నేతలం కనుక తాము కాల్ చేస్తే, కలెక్టర్ అయినా, మంత్రి అయినా స్పందించాలని, ప్రజల కోసం తాము పనిచేస్తున్నాం అన్నారు. రాత్రికి రాత్రే రెండుసార్లు గ్రంథాలయం చైర్మన్ పదవి, ఇవ్వడంతో పాటు గతంలో చేసిన వ్యక్తికే పదవులు.. జిల్లా మంత్రి సూచించిన వారికే పదవులు వెళ్తున్నాయని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కూడా తమను అడుగుతారని, వారికి, కార్యకర్తలకు ఎలా న్యాయం చేయగలుగుతాం అని, క్యాడర్ బాగుంటే పార్టీ బాగుంటుందన్నారు. పార్టీ అధిష్టానం గురించి తాము మాట్లాడటం లేదని, జిల్లా మంత్రి వల్లే ఇదంతా జరిగిందని మైనంపల్లి స్పష్టం చేశారు.
మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై పార్టీకి చెందిన ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం విప్పారు. తనకు కావాల్సిన వారికే, మేడ్చల్ జిల్లా పదవులను సైతం మేడ్చల్ నియోజకవర్గ నేతలకు ఇప్పిస్తున్నారని ఐదుగురు ఎమ్మెల్యేలు పేరు చెప్పకుండా మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు చేశారు. మంత్రి ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. మైనంపల్లి ఇంట్లో మేడ్చల్ జిల్లాకు చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ సోమవారం సమావేశమయ్యారు. పదవుల పంపకం, జిల్లాలో కేవలం మేడ్చల్ నియోజకర్గం వారికే ప్రాధాన్యత ఇవ్వడం, మంత్రి మల్లారెడ్డి సూచించిన వారికే పదవులు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.