Hyderabad News: ఈ చెత్తలోనే మా ప్రాణాలు తీసేయండి- జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధితుల కన్నీళ్లు!
Hyderabad Latest News: జవహార్ నగర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే సమయంలో స్థానికులకు అనేక హామీలు ఇచ్చారు అధికారులు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Hyderabad Latest News: అభివృద్ధిలో వేగంగా పరుగులు పెడుతున్న హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనేకం. ఎన్నికల సమయంలో మాత్రమే పాలకులకు గుర్తొచ్చే వాటిలో మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి. ఇక్కడ కార్మికనగర్ లో కొన్ని దశాబ్దాలుగా వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. కూలీ కష్టంతో వచ్చిన డబ్బుతో చిన్న గూడు నిర్మించుకున్నారు. ఇంటి పన్ను, విద్యుత్ పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. కానీ ఇక్కడ జీవించడం వీరికి ప్రాణ సంకటంగా మారింది. చుట్టూ టన్నుల కొద్ది చెత్త నింపి తమ ప్రాణాలతో చెలగాటమాడుతోంది జిహెచ్ఎంసీ అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ ప్రవేటు సంస్థకు డంపింగ్ యార్డ్ నిర్వహణ కేటాయించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే సమయంలో స్థానికులకు అనేక హామీలు ఇచ్చారు అధికారులు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కురమారస్వామి అనే బాధితుడి పరిస్థితి అత్యంత దారుణం. ఇతని ఇంటిని ఆనుకుని చుట్టూ ఎతైన కొండల్లా టన్నుల కొద్దీ చెత్త నింపేశారు. వర్షం పడితే మురుగు, చెత్త నేరుగా ఇంటిపైకి చేరిపోతోంది.ఎప్పుడు టన్నుల కొద్దీ చెత్త విరిగి అమాంతం ఈ ఇంటిని ,ఇంట్లో నివసించేవారిని కభళిస్తాయో తెలియదు. అంతలా భయానక పరిస్థితిలో దిక్కుతోచక ఈ చెత్తలో జీవిస్తోంది వీరి కుటుంబం. కష్టపడిన సొమ్ముతో ఇక్కడ జాగా కొనుక్కుని, ఓ ఇంటిని నిర్మించుకున్నారు. అప్పడు ఇలా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తారు. ఇంతలా ఇబ్బందులు ఎదురవుతాయని అనుకోలేదు.డంపింగ్ యార్డు పేరుతో మా ప్రాణాలు తీసేయండి, ఇక్కడ ఉండలేకపోతున్నాం. అలా అని బయటకు వెళ్లి అద్దె చెల్లించే ఆర్దిక పరిస్థితి వీరికి లేదు.దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడే బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు.
మేము డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు 18 ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం. డప్పింగ్ యార్డ్ పెట్టే ముందు ఇక్కడ మాకోసం దవాఖానా ఏర్పాటు చేస్తామన్నారు. నీరు కలుషితమైనా ఇబ్బంది పడకుండా తాగునీరు సరఫరా చేస్తామన్నారు. అవన్నీ వట్టి మాటలేనని తేలిపోయిందంటున్నారు స్థానికులు. రాత్రైతే చెత్తనుండి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నాం. మమ్మల్ని ఉంచుతారా.. ఈ చెత్తలోనే చంపుతారా.. ? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాల కిందట ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. మరి ప్రభుత్వ భూమి అయితే మా వద్ద ఇన్నాళ్లు ప్రొపర్టీ టాక్స్, పవర్ బిల్ ఎలా కట్టించుకుంటున్నారు..? ఇక్కడ ఎవరికీ అభ్యంతరం లేదని మమ్మల్ని సంప్రదించకుండానే, తప్పడు సర్వేలు చేసి ఓ ప్రవేటు సంస్థకు డంపింగ్ యార్డు కోసం భూమి ఎలా కట్టబెట్టారంటూ మండిపడుతున్నారు.
రెండు దశాబ్దాలుగా మేము ఇక్కడే జీవిస్తున్నట్లు మాకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డంపిండ్ యార్డ్ కోసం మమ్మల్ని బలవంతంగా తరిమేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రైతే చాలు భరించలేని దుర్వాసన , చెట్లు కాలిపోతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి. కనీసం గొంతు తడుపుకుందామంటే కాళకోట విషంలా ఇక్కడి నీరు మారిపోయింది. ఇళ్లు వదలిపోదామంటే రోజు కూలితో కిరాయి కట్టలేని దుస్థితి మాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధితులు.
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం డంపింగ్ సమస్య పరిష్కారం కోసం హామీలు ఇస్తున్నారు. ఎన్నికలు ముగిశాక మా వైపు కన్నెత్తి చూడటం లేదంటున్నారు. మీకు ఎలాంటి సమస్య ఉండదు. కేవలం ఒకటి రెండు ప్రాంతాల నుంచి మాత్రమే చెత్తను ఇక్కడకు తరలిస్తామంటూ చెప్పారు. ఆ తరువాత దూర ప్రాంతాల నుండి కూడా భారీగా చెత్తను ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. ఇక్కడ జీవిస్తున్నవారు దుర్వాసనతో, కలుషితమైన జలాలు త్రాగి ప్రాణాలు కోల్పోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.