Marri Shashidhar Reddy: కాంగ్రెస్‌కు మర్రి శశిధర్ రాజీనామా, పార్టీ గురించి సంచలన ఆరోపణలు
హైదరాబాద్‌లో మర్రి శశిధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతూ ఉందని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. తాను రాజీనామా లేఖను పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపానని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతూ ఉందని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీతో సుదీర్ఘ బంధం ఉన్న తాను చాలా బాధతోనే కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నట్లుగా చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్ర బాగు కోసమే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ కూడా ఆ మధ్య ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణ చేశారు.
డబ్బులు ఇచ్చేవాళ్ల మాటే చెల్లుతుంది - మర్రి
‘‘ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికి నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూ వచ్చాం. అయినా ఆయన్ను ఆరేళ్ల పాటు టీపీసీసీ ప్రెసిడెంట్ గానే ఉంచారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించే వ్యక్తులు హైకమాండ్‌కు ప్రతినిధిగా ఉంటూ అందరినీ సమన్వయం చేయాలి. తప్పులు, లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దాలి. కానీ వారు పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా మారిపోయారు. కాంగ్రెస్‌లో డబ్బులిచ్చే వాళ్ల మాటే చెల్లుతూ ఉంది’’ అని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జిగా మాణిక్కం ఠాకూర్ ఉన్న సంగతి తెలిసిందే.
పార్టీ గుర్తు ఎంపికలో తన తండ్రి చెన్నారెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పారు. ఇన్నేళ్లు పార్టీతో తనకున్న అనుబంధాన్ని వదిలి వెళ్తున్నందుకు విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని ఇటీవలే మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయనను పార్టీలోకి క్రమశిక్షణ కమిటీ ఆరేళ్లపాటు మర్రి శశిధర్ రెడ్డిని సస్పెండ్ చేసింది.
బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి !
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి నవంబర్ 18న కలిశారు. అమిత్ షాతో శశిధర్ రెడ్డి భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరికపై రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర మంత్రి అమిత్ షాతో కాసేపు చర్చించారు. పార్టీలో చేరికను బీజేపీ పెద్దలు స్వాగతించినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ తిరిగొచ్చాక తన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడి మంచి రోజున పార్టీలో చేరుతానని శశిధర్ రెడ్డి అన్నట్లు సమాచారం.
మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్
కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిసిన తర్వాత బయటకు వచ్చి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పైన, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉందని.. ఎంతో మంది వచ్చారు. పోయారు కానీ పార్టీ అలాగే నిలబడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి కాన్సర్ వచ్చిందని మర్రి శశిధర్ రెడ్డి అనడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందంటూ మండిపడ్డారు. పార్టీ మారి బీజేపీలో చేరాలని అనుకునే వారు, వారికి పోయే స్వేచ్ఛ ఉందని, కాని కాంగ్రెస్ ను నిందించే హక్కు లేదని అన్నారు. ఎవరు ఎలాంటి వారో ఏ పార్టీ ఎలాంటిదో భవిష్యత్తులో తేలిపోతుందని మల్లు రవి అన్నారు.