Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Tirumala Rains: తిరుపతి జిల్లావ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో టీటీడీ భక్తులను అలర్ట్ చేసింది.
Boulders Falling On Tirumala Ghat Road: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంలో తిరుపతి జిల్లా (Tirupati District) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల ధాటికి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్ రోడ్డులో హరిణికి సమీపంలో జారిపడిన బండరాళ్లను సిబ్బంది తొలగించారు. ఘాట్ రోడ్డులో జాగ్రత్తగా వాహనాలు నడపాలని టీటీడీ అధికారులు సూచించారు. అటు, భారీ వర్షాల నేపథ్యంలో తితిదే ముందస్తు చర్యలు చేపట్టింది. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీహరిపాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహనాల రాకపోకలు నిలిపేసింది. 2 ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో ఇంజినీరింగ్ అధికారులను అలర్ట్ చేసింది.
భక్తుల ఇబ్బందులు
మరోవైపు, భారీ వర్షంతో తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి కొండపై చలి తీవ్రత పెరిగింది. దర్శనానంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు, గదులకు వెళ్లే భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో తలదాచుకుంటున్నారు. సీఆర్వో వద్ద గదులు పొందే భక్తులు వర్షానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. అటు, పాపవినాశనం జలాశయం నీటి సామర్థ్యం పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు. మరోవైపు, కేవీబీ పురం మండలంలో తుపాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రెండు వంకలు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
అటు, తిరుపతి జిల్లా అధికారులను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. తిరుమల, సూళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఘాట్ రోడ్లలో ప్రయాణించే శ్రీవారి భక్తులు సహా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంట లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహా ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను ఆదేశించారు. తిరుపతిలో మాల్వాడిగుండం జలపాతం ఉద్ధృతంగా ప్రవహించడం సహా తిరుపతి జిల్లాలోని కాళంగి, ఇతర ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్