KTR News: ఆక్సిజన్ మాస్కులు, నీళ్లు లేకుండా అంబులెన్సులు, ఫైరింజన్లు వస్తే ఏం ప్రయోజనం? కేటీఆర్ ఆగ్రహం
Charminar Fire Accident in Hyderabad | చార్మినార్ అగ్నిప్రమాదం బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షలు కాదు రూ.25 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

KTR demands Rs 25 lakhs for victims | హైదరాబాద్: అందాల పోటీల మీద పెట్టే ఖర్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలన్నారు. పాతబస్తీ చార్మినార్‌లోని గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సోమవారం నాడు కేటీఆర్ పరిశీలించారు. హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం, ఎక్కువ ప్రాణాలు పోయిన దుర్ఘటన ఇదన్నారు. క్షతగాత్రులను, బాధిత కుటుంబసభ్యులను కేటీఆర్ ఓదార్చారు. ప్రభుత్వం అందాల పోటీలపై చూపే శ్రద్ధ, అగ్నిప్రమాదాలు, వాటి నివారణపై పెడితే బాగుండేదన్నారు.
రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్
చనిపోయిన తరువాత ఏదో రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు కాదు రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎప్పటినుంచో వ్యాపారి కుటుంబం అక్కడే నివాసం ఉంటోంది. దురదృష్టవశాత్తూ అగ్నిప్రమాదం జరిగి, ఒకే కుటుంబంలో ఏకంగా 17 మంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. వారు జీవనోపాధికి దోహద పడాలంటే భారీ పరిహారం అందించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుటుంబంలో జరిగిన విషాదం, మరో కుటుంబానికి జరగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2025
ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్‌లో నీళ్ళు లేకుండా ఘటనా స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయాం అని బాధితులు చెప్తున్నారు – కేటీఆర్ pic.twitter.com/tClefrezTs
ప్రమాదాలు జరిగితే సాయం చేసే పరికరాలు అవసరం
హైదరాబాద్ లోనే కాదు జిల్లాల్లోనూ రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో తక్షణం వారికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్‌లో నీళ్ళు లేకుండా ఘటనా స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం తెలియగానే అవసరమైన పరికరాలు లేకుండా అంబులెన్స్, అరకొర నీళ్లతో ఫైరింజన్లు వస్తే ఏం లాభమన్నారు.
ఆ కుటుంబంలో 17 మంది చనిపోయినా వారు ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని, తమకు చుట్టుపక్కల వారు సాయం చేశారని.. మరో కుటుంబానికి ఈ గతి పట్టకుండా చూడాలని మాత్రమే బాధిత కుటుంబం చెప్పిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలన్నారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ నుండి ఇద్దరు పోలీసులు మాత్రమే వచ్చారు అంటూ బాధిత మహిళ తన గోడు కేటీఆర్‌కు వెళ్లబోసుకున్నారు. నిర్లక్ష్యం కారణంగానే వారి ప్రాణాలు దక్కలేదని, ఆక్సిజన్ మాస్కులు ఉంటే కొందరైనా బతికేవారని అన్నారు.






















