Indira Soura Giri Jala Vikasam Scheme: రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, లబ్ధిదారులు ఎవరంటే
Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గం మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సోమవారం ఉదయం ప్రారంభించారు.

అమ్రాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ప్రారంభించారు. పోడు రైతులకు ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలుకు అనుమతులు మంజూరు చేస్తూ మే 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రూ.12,600 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
అంతకుముందు బేగం పేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మాచారం గ్రామంలో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ. 12,600 కోట్ల బడ్జెట్ తో తెలంగాణ ప్రభుత్వం “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని చేపట్టింది. ఒక్కో యూనిట్ కు రూ. 6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనున్నారు.
పోడు రైతుల ప్రయోజనాల కోసం ఈ స్కీమ్
పథకాన్ని ప్రారంభించిన అనంతరం కొందరు లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. తాను వచ్చే ఏడాది మళ్లీ ఇక్కడికి వచ్చి చూస్తానని ఈ లబ్ధి ద్వారా రైతులు ఏం పండించారు, వారికి ఎంత లబ్ధి చేకూరిందని చూస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతులకు ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు చేయనుంది ప్రభుత్వం. తద్వారా 6 లక్షల ఎకరాల మేర పోడు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఈ పథకానికి ఐదేళ్లలో రూ.12,600 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్లు ఖర్చు చేయనుండగా, వచ్చే ఏడాది నుంచి 4 ఏళ్లు పాటు ప్రతి ఏడాది రూ.3వేల కోట్ల చొప్పున పోడు పట్టాల రైతుల కోసం ఖర్చు చేయనున్నారు. పోడు పట్టాల రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం అమలుకు ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులను ప్రభుత్వం వినియోగించనుందని సమాచారం.
ఈ కార్యక్రమం అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభకు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు బయలుదేరారు. కొండారెడ్డిపల్లెలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం కొండారెడ్డిపల్లె నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.






















