Indira Soura Giri Jala Vikasam Scheme: రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం, మే 18న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana News | సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న అమ్రాబాద్‌లో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు. 6 లక్షల ఎకరాల పోడు రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

Telangana Farmers | హైదరాబాద్: రైతు భరోసాపై ఇటీవల శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా పోడు రైతులకు తీపి కబురు చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతులకు ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల ఎకరాల మేర పోడు రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అందించనున్నారు. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మాచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
రూ.12,600 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కోసం వచ్చే ఐదేళ్లలో (ఈ ఆర్థిక ఏడాది నుంచి 2029-30 వరకు) దాదాపు రూ.12,600 కోట్లను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సంవత్సరంలో సర్కార్ రూ.600 కోట్ల ను ఖర్చు చేయనుండగా, వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు రూ.3వేల కోట్ల చొప్పున పోడు పట్టాలు పొందిన రైతుల కోసం ఖర్చు చేయనున్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం అమలుకు ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులను ప్రభుత్వం వినియోగించనుందని సమాచారం. రాష్ట్రంలోని పోడు పట్టాల రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేయాలని భావిస్తోంది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పోడు పట్టాలు పొందిన రైతులకు ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలుకు అనుమతులు మంజూరు చేస్తూ గురువారం (మే 15న) తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ స్కీమ్ ద్వారా పోడు పట్టాలు పొందిన రైతుల భూముల్లో బోర్లు వేయడం, వాటికి సోలార్ పంపు సెట్లు అందించడం లాంటి మరెన్నో మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది. పోడు రైతులకు ఎలాంటి ఖర్చులు లేకుండా, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరించనుంది. గిరిజనులపై ఎలాంటి బారాన్ని మోపడం లేదని అధికారులు తెలిపారు.
మండలాల వారీగా మే 25వ తేదీ వరకు అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించాలి. జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలనతో పాటు భూగర్భ జలాల సర్వే, ఇతర అంచనాలు సిద్ధం చేయాలి. జిల్లాస్థాయిలో మే 30 నాటికి సర్వే, ఇతర పనులకు టెండర్లు సైతం ఖరారు చేయాలి. జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు అప్పగించాలి. జూన్ 26 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పోడు భూముల అభివృద్ధి, బోరుబావుల ఏర్పాటు, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు, లాంటి మౌలిక సదుపాయాలు కల్పించి.. ఉద్యాన పంటల పనులు చేసి, యూనిట్ల వినియోగపత్రాలను సమర్పించాలని ప్లాన్ చేశారు.






















