Khairatabad Ganesh: ఈసారి మరింత ఎత్తుతో ఖైరతాబాద్ గణేష్, ఎంతో చెప్పిన ఎమ్మెల్యే దానం
Hyderabad News: ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ రానుంది. అప్పుడు ప్రతిష్ఠించబోయే భారీ గణనాథుడి విగ్రహ తయారీ పనులు ఇప్పటి నుంచే తయారు చేయడం మొదలుపెట్టారు.
Khairatabad Ganesh Height: వినాయక చవితి కోసం ఖైరతాబాద్‌లో నెలకొల్పే భారీ గణపతి విగ్రహం ఎత్తు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ అత్యంత ఎత్తైన విగ్రహం తయారీ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిష్ఠించి, పూజలందుకొని నిమజ్జనం జరిగే వరకూ ఏటా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం తయారీ కోసం తొలుత కర్ర పూజ నిర్వహించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఆ కర్రపూజను నేడు నిర్వాహకులు జరిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ రానుంది. అప్పుడు ప్రతిష్ఠించబోయే భారీ గణనాథుడి విగ్రహ తయారీ పనులు ఇప్పటి నుంచే తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ వినాయక విగ్రహం ఏర్పాటుకు నేడు కర్ర పూజ జరిగింది. ఈ కర్ర పూజ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
కర్రపూజ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని.. సంప్రదాయం ప్రకారం నేడు కర్రపూజ చేసి విగ్రహం తయారీని ప్రారంభించామని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయాన్ని చెప్పారు. దాని ప్రకారం అన్ని విభాగాలను సిద్ధం చేస్తున్నామని.. రాబోయే రెండుమూడు రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశం జరుపుతామని దానం నాగేందర్ చెప్పారు. వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని దానం నాగేందర్ చెప్పారు.
ఖైరతాబాద్ గణపతిని నెలకొల్పడం మొదలుపెట్టి.. ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వహకులు నిర్ణయించినట్లు దానం చెప్పారు.
గతేడాది ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తి మట్టి విగ్రహంగా సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు.