Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అనుమతి ఉందా? లేదా?
Kaleshwaram Project: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్ద బాంబు పేల్చారు. కేసీఆర్ హయాంలో మంత్రిగా ఉన్న తుమ్మల, కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయలేదని చెప్పారు.

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇప్పుడు విచారణ జరుపుతోంది. ఇప్పటికే నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కమిషన్ ఎదుట హాజరయ్యారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన చర్చ అంతా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వంలో క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందా లేదా అన్న అంశంపైనే. మాజీ మంత్రులైన బీఆర్‌ఎస్ నేతలు మాత్రం ఈ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెబుతుంటే, కేసీఆర్ క్యాబినెట్‌లో పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం క్యాబినెట్ ఆమోదం లేదని చెబుతున్నారు. ఇరు వర్గాలు భిన్న వాదనలు వినిపిస్తుంటే, కాళేశ్వరం కమిషన్ ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును క్యాబినెట్ ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించిందంటున్న బీఆర్‌ఎస్
మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా గులాబీ నేతలంతా కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపిందని చెబుతున్నారు. క్యాబినెట్ ఆమోద ముద్రతోనే పారదర్శకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని వాదిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ ఒక్కరి నిర్ణయం కాదని, ఇది క్యాబినెట్ ఏకగ్రీవ నిర్ణయమని గట్టిగా చెబుతున్నారు. ఈ విషయంలో తాము దాచిందేమీ లేదని, కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేసే కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు.
ఇక కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఇదే మాట చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు క్యాబినెట్ ఆమోదం వేసిన తర్వాతే జరిగాయని కమిషన్ ఎదుట చెప్పినట్లు ఆయన వెల్లడించారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు స్థల మార్పు, ప్రాజెక్టు నిర్మాణ పనులు, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ఏర్పాటు అన్నీ క్యాబినెట్‌లో చర్చ జరిపి అందరి ఏకగ్రీవ ఆమోదంతోనే జరిపినట్లు చెబుతున్నారు. మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చే అంశం నిపుణుల కమిటీ సూచన మేరకే జరిగిందన్నారు. ఈ అంశాలన్నీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీసీ ఘోష్ కమిటీకి ఆధారాలతో సహా నిరూపించినట్లు విచారణ అనంతరం హరీశ్ రావు చెప్పారు.
కార్యనిర్వాహక ఉత్తర్వులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం
అయితే బీఆర్‌ఎస్ నేతలు చెబుతోన్న వాదనను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు కొట్టిపారేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలపై చర్చించింది. ఈ నివేదికలన్నీ ప్రాజెక్టు అమలు, నిర్మాణం తీరులో లోపాలను ఎత్తి చూపాయని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. డీపీఆర్ ల ఆమోదం లేకుండానే నిర్మాణం ప్రారంభించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. డీపీఆర్‌లతో సంబంధం లేని మార్పులు చేశారని చెబుతున్నారు.
లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు దేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత విపత్తుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రీ-మాన్‌సూన్, పోస్ట్-మాన్‌సూన్ తనిఖీలు నిర్వహించలేదని కూడా ఆయన పేర్కొన్నారు.
క్యాబినెట్ ఆమోదం పొందలేదు: మంత్రి తుమ్మల
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు ఇలా ఉంటే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్ద బాంబు పేల్చారు. కేసీఆర్ హయాంలో మంత్రిగా ఉన్న తుమ్మల, కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయలేదని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నాటి మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అవాస్తవాలు చెప్పారని తుమ్మల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతి అంశం క్యాబినెట్‌లో ఎన్నడూ చర్చ జరగలేదన్నారు. ఇది క్యాబినెట్ ఏకగ్రీవ నిర్ణయం కాదని, కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వులు కథంతా నడిచిందని తుమ్మల చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన తర్వాత మూడేళ్లకు అంచనాలు పెంచుతున్న విషయంపైనే క్యాబినెట్‌లో చర్చ జరిగిందన్నారు.
క్యాబినెట్ అనుమతి విషయం బయటపడేది కమిషన్ నివేదికలోనే
క్యాబినెట్ అనుమతితోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని బీఆర్‌ఎస్ నేతలు చెబుతుంటే, అలాంటిది లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై పీసీ ఘోష్ కమిటీ కేసీఆర్ దగ్గర వివరణ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్యాబినెట్‌లో ఆమోద ముద్ర తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా లేక తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నట్లు కేవలం జీవోల ద్వారా నిర్మాణం జరిగిందా అన్న విషయం కమిషన్ నివేదికతోనే తెలిసే అవకాశం ఉంది.






















