Drive In Theatre: హైదరాబాద్‌లో డ్రైవ్ ఇన్ థియేటర్, కార్లలో కూర్చొనే సినిమా చూడొచ్చు - ఎక్కడో తెలుసా?
హైదరాబాద్‌లో మొట్టమొదటి డ్రైవ్ - ఇన్ థియేటర్ శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఏర్పాటు కానుంది.
హైదరాబాద్‌కు మరో వినోద కేంద్రం అతి త్వరలో రాబోతోంది. ఇప్పటిదాకా ఇతర నగరాలకే పరిమితం అయిన డ్రైవ్ - ఇన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇక హైదరాబాద్‌లో కూడా కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీంతో ఇకపై సినిమాకు వెళ్లడంలో కొత్త అర్థం రానుంది. ఈ డ్రైవ్ - ఇన్ థియేటర్ రాకతో ఇక సినిమా ప్రియులకు పండగ అనే చెప్పాలి. ఎంచక్కా సొంత కార్లను లోపలి వరకూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి అక్కడుండే పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అక్కడే లభించే కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకొని కారు సీట్‌లోనే కూర్చొని పెద్ద తెరపై సినిమాను ఆస్వాదించవచ్చు.
హైదరాబాద్‌లో మొట్టమొదటి డ్రైవ్ - ఇన్ థియేటర్ శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఏర్పాటు కానుంది. ఇది ఇండియాలోనే మొట్టమొదటి ఎయిర్ పోర్టు డ్రైవ్ - ఇన్ థియేటర్ కావడం విశేషం. ఇప్పటికే హైదరాబాద్‌లో స్టార్లిట్ సినిమాస్ వంటి సంస్థలు డ్రైవ్ - ఇన్ థియేటర్ నిర్వహిస్తున్నా, ఇది రోజూ అందుబాటులో ఉండడం లేదు. కానీ, త్వరలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిపోర్టులో ప్రారంభించే డ్రైవ్ - ఇన్ థియేటర్ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు.
ఆర్‌జీఐ ఎయిర్ పోర్టు పరిసరాల్లో ఏర్పాటు చేసే శాశ్వత డ్రైవ్ - ఇన్ ఓపెన్ థియేటర్‌తో నగరవాసులు సినిమాకు వెళ్లడంలో కొత్త అనుభూతి చెందనున్నారు. ఎయిర్ పోర్టు చుట్టుపక్కల అందమైన ప్రదేశాలు, ప్రశాంతమైన వాతావరణం నడుమ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఆహ్లాదకరమైన అనుభవం పొందనున్నారు.
ఆక్వా గోల్ఫ్ కోర్స్ కూడా
శాశ్వత ఓపెన్ ఎయిర్ థియేటర్ తో పాటుగా ఒక ఆక్వా గోల్ఫ్ కోర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆక్వా గోల్ఫ్ కోర్స్ అంటే.. నీటిలో గోల్ఫ్ ఆడడం. మామూలు గోల్ఫ్ కోర్సుల్లో గ్రీన్ ఫ్లోరింగ్ ఉంటుంది. ఆక్వా గోల్ఫ్ అంటే ఏకంగా ఒక కొలనులో గోల్ఫ్ ఆడతారు. ఇందులో బాల్స్ నీటిపై తేలుతూ ఉంటాయి. ఆ బాల్స్‌ను నీటిలోనే ఏర్పాటు చేసిన గోల్స్‌లో పడేలా కొట్టాలి.
అయితే, ఈ డ్రైవ్ ఇన్ థియేటర్, ఆక్వా గోల్ఫ్ కోర్స్ లు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదు. ఆ ఓపెన్ థియేటర్‌లో ఎన్ని కార్ల సామర్థ్యం ఉంటుంది? టికెట్ ధర ఎంత ఉంటుందనేది కూడా ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి ఆ డ్రైవ్ ఇన్ థియేటర్ అందుబాటులోకి వస్తే నగరవాసులు సినిమా చూడడంలో కొత్త అనుభూతి పొందనున్నారు.