హైదరాబాద్‌లో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- పొగమంచుతో జనం పాట్లు
Telangana Weather News: తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీలు ఉంటే.. గరిష్ణ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు అయింది..
Telangana Weather: తెలంగాణలో చలి తీవ్ర రోజురోజుకు పెరుగుతోంది. ఒకట్రెండు జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితం అయ్యాయి. మిగతా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు.
సోమవారం వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన ఉష్ణోగ్రతల వివరాలు పరిశీలిస్తే... కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీలు సిర్పూర్‌లో నమోదు అయింది. ఆ తర్వాత స్థానాల్లో ఆదిలాబాద్ 9.2, మెదక్‌లో 11.6, రామగుండంలో 13.6, హకీంపేట్14.6, దుండిగల్ 14.7, నిజామాబాద్ 15.1, హనుమకొండ 15.5, హైదరాబాద్ 15.5 డిగ్రీలుగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత విషయానికి వస్తే ఖమ్మంలో 31 డిగ్రీలు రిజిస్టర్ అయింది.
పొగమంచు తెలంగాణ రాష్ట్రాన్ని కమ్మేస్తోంది. ఉదయం పది గంటలకి కూడా సూర్యుడు కనిపించడం లేదు. పది అడుగుల దూరంలో ఉన్న వస్తువులు, వాహనాలు, బిల్డింగ్స్, మనుషులు కనిపించడం లేదు. చలికి గజగజ వణికిపోతోంది. బయటకు రావాలంటే భయపడిపోతోంది.
కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు మాత్రం చలి విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా కొన్ని తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 15.5 డిగ్రీలుగా నమోదైంది. 88 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.