Hyderabad: వినాయక నిమజ్జనంపై సర్కార్ సతమతం.. ఈసారి అలా కుదిరిలేలా లేదు! ప్రత్యామ్నాయాలేంటి?
హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ ఓ లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఏటా గణపతి నవరాత్రుల అనంతరం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఎంత వైభవోపేతంగా జరుగుతుందో అందరికీ తెలిసిందే. వీధివీధిలో వెలసిన గణనాథులు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వైపునకు క్యూ కడుతుంటాయి. ఆ నిమజ్జనం రోజు ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉంటుంటాయి. అయితే, ఈ ఏడాది మాత్రం వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఎందుకంటే హైకోర్టు విడుదల చేసిన ఆదేశాలు ప్రభుత్వానికి అడ్డంకిగా మారాయి. అదే సమయంలో కోర్టు చేసిన సూచనలు అమలు చేసేందుకు సమయం కూడా లేకపోవడంతో నిమజ్జనంపై ఆసక్తి నెలకొంది.
హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణు మాధవ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే..
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై రెండేళ్లగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. కానీ, జీహెచ్‌ఎంసీ మాత్రం ఆ దిశగా ప్రత్యామ్నాయాలు చేయలేదు. దీంతో ఈసారి నిమజ్జనంపై హైకోర్టు స్పష్టమైన ఆంక్షలతో ఆదేశాలిచ్చింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని ఆదేశించింది. కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయొచ్చని పేర్కొంది. అది కూడా ట్యాంక్ బండ్ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనం చేయొద్దని.. పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వైపు నుంచి నిమజ్జనాలు చేసుకోవాలని సూచించింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి, అందులో నిమజ్జనం చేయాలని సూచన చేసింది.
నగరంలో వినాయక విగ్రహాలు కలిపి దాదాపు 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. వీటిలో లక్షకుపైగానే హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనాలు చేస్తారు. 5 నుంచి 40 అడుగుల విగ్రహాల్లో ఎక్కువగా హుస్సేన్ సాగర్‌కే క్యూ కడుతుంటాయి. నగర వ్యాప్తంగా మరో 40 చెరువుల్లోనూ నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి.
ప్రభుత్వం మల్లగుల్లాలు
హైకోర్టు ఆదేశాలతో నిమజ్జనం పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత రావడం లేదు. దీనిపై ప్రత్యామ్నాయం లాంటివేమీ ఇప్పటిదాకా జీహెచ్ఎంసీ రూపొందించలేదు. కర్ణాటకలో విజయవంతమైన మినీ నిమజ్జన కొలనులను నగరంలో 150 చోట్ల నిర్మించాలని రెండేళ్ల కిందట నిర్ణయించారు. కానీ, అలాంటివాటిని 30 మాత్రమే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో 185 చెరువులున్నా.. వాటిలో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నారా అనేదానిపై కూడా స్పష్టత లేదు. ఎలాంటి ఏర్పాట్లు లేకుండా ఈ ఏడాది సాగర్‌లో నిమజ్జనాన్ని నిలిపేస్తే ఇబ్బందులు వస్తాయని బల్దియా ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
అత్యవసర విచారణను నిరాకరించిన హైకోర్టు
వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆదివారం న్యాయమూర్తి ఇంట్లో అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. కోర్టు తోసిపుచ్చింది. హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. హౌజ్ మోషన్‌కు అనుమతి నిరాకరించింది. రేపు ఉదయం ప్రస్తావిస్తే లంచ్ మోషన్ విచారణకు పరిశీలిస్తామని తెలిపింది.
హైకోర్టు పెద్ద మనసు చేసుకోవాలి: తలసాని
గణేశుడి విగ్రహాల నిమజ్జనం విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమయం లేనందున హైకోర్టు పెద్ద మనసు చేసుకొని ఈ ఏడాదికి యథావిధిగా నిమజ్జనం చేసేలా అవకాశం కల్పించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని అన్నారు. వినాయక చవితి పండుగకి ఒక రోజు ముందు నిమజ్జనాలపై హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరిపోయాయని చెప్పారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాధ్యం కాదని చెప్పారు. హైకోర్టు క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు.