Toll Charges: ఎన్నికల తరువాత దేశంలో తొలి బాదుడు, రోడ్డుపైకి వస్తే టోల్ చార్జీల మోతే!
ORR Toll Charges: దేశంలో ఎన్నికలు ముగిసిన వేళ ధరల పెంపు మొదలైంది. దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరగనున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై అమలులోకి వస్తాయని ఐఆర్‌బీ తెలిపింది.
Hyderabad ORR Toll Charges: దేశంలో పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Election 2024) ముగిసిన వేళ ధరల పెంపు మొదలైంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మరోసారి టోల్ చార్జీలు (Toll Charge Hike) పెరగనున్నాయి. సాధారణంగా ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెరుగుతాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో టోల్ చార్జీల పెంపునకు ఓఆర్‌ఆర్ టోల్ నిర్వహణ సంస్థ ఐఆర్‌బీ (IRB) నిర్ణయించింది. అందులో భాగంగా పెంపునకు సంబంధించిన టోల్ చార్జీల వసూలు కోసం అన్ని ఇంటర్‌చేంజ్‌ల వద్ద బోర్డులు, పోస్టర్లులు ఏర్పాటు చేసుకుంది. కానీ ఈసారి ఎన్నికల కోడ్(Election Code) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (Election Commission) టోల్ చార్జీల పెంపును వాయిదా వేసింది.
ఈసీ నిర్ణయంతో పెంపు వాయిదా
ఎన్నికల కమిషన్ నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై టోల్ చార్జీలను పెంచడాన్ని అధికారులు వాయిదా వేశారు. పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో టోల్ చార్జీల పెంపు నిర్ణయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) అధికారులు పెండింగ్‌లో ఉంచారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి పాత రేట్లతోనే టోల్ వసూలు చేయాలని అధికారులు సూచించారు.
సోమవారం అర్ధరాత్రి నుంచి కొత్త రేట్లు
మే 13న తెలంగాణలో ఎన్నికలు ముగిసిన అనంతరం టోల్ చార్జీల పెంపు అమలు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సి ఉండడంతో వాయిదా వేశారు. తాజాగా జూన్ 1తో దేశ వ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో టోల్ చార్జీల పెంపునకు హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. కారు, జీపు, వ్యానుకు రూ.2.34, మినీ బస్సుకు రూ.3.77, బస్సు రూ.6.69, వాణిజ్య వాహనాలు రూ.8.63, భారీ నిర్మాణ మెషనరీ, ట్రక్కులకు రూ.12.40, ఓవర్ సైజున్న వాహనాలకు రూ.15.09 చొప్పున పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు అన్నీ సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత అమలు లోకి వస్తాయని, వాహనదారులు సహకరించాలని ఐఆర్‌బీ కోరింది.
పతంగి టోల్ గేట్‌లో పెరిగిన చార్జీలు
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హైదరాబాద్-విజయవాడ (65), హైదరాబాద్-వరంగల్ (163) జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు(నందిగామ), వరంగల్ హైవేపై బీబీనగర్ మండలం గూడురు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటి మీదుగా నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ఒక రోజుకు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా సుమారు 30 వేలకు పైగా, గూడురు టోల్‌ప్లాజా వద్ద 27 వేల వాహనాలు తిరుగుతుంటాయి. ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద టోల్ చార్జీలు సైతం పెరిగాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు రెండు వైపు ప్రయాణానికి రూ.5, చిన్న లారీ 10 టైర్స్‌పై10 రూపాయలు పెరిగాయి. వాణిజ్య, భారీ గూడ్స్ లారీలకు రూ.15 పెరిగింది. మొత్తం ఐదు శాతం మేర టోల్ చార్జీలు పెంచినట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.