Hyderabad Water Supply Update: హైదరాబాద్ వాసులకు అలర్ట్: 36 గంటలపాటు కృష్ణా నీటి సరఫరా బంద్, మీ ప్రాంతం ఉందో లేదో చూసుకోండి
Hyderabad Water Supply Update: హైదరాబాద్‌లో జలమండలి కీలక సూచనలు చేసింది. పైపులైన్ల మరమ్మతులు కారణంగా శని, ఆదివారాలు నీటి సరఫరాల నిలిచిపోతుందని తెలిపింది.

Hyderabad Water Supply Update: మహానగర జీవనాడి అయిన కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి జలమండలి కీలక ప్రక్రియకు సిద్ధమైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలకు తాగునీరు అందించే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ స్కీమ్ ఫేజ్ -2 పంపింగ్ వ్యవస్థకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సిన ఉన్నందున, ఏకంగా 36 గంటలపాటు నీటి సరఫరాను నిలిపేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఈ అంతరాయం కలగనుంది. వేసవి సమీపిస్తున్న వేళ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరమ్మతులు ఎందుకు? ఎక్కడ?
నగరానికి నీరు చేరవేసే పైపులైన్‌లో అక్కడక్కడా లీకేజీలు, సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల నీటి వృథా జరగడమే కాకుండా, సరఫరా ఒత్తిడి కూడా తగ్గుతోంది. దీనిని నివారించేందుకు జలమండలి యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోంది. కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్ పైపులైన్‌పై 20 మి.మి డయా ఎంఎస్ పైపునకు ఏర్పడిన లీకేజీ అరికట్టడం ప్రధాన లక్ష్యం.
దీంతోపాటు దెబ్బతిన్న 2375మి.మి. డయా ఎంఎస్ ఎయిర్ టీలు, బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్‌ఆర్‌వీల మార్పిడి వంటికీలక పనులు కూడా ఈ 36 గంటల వ్యవధిలో పూర్తి చేయనున్నారు. ముఖ్యంగా నసర్లపల్లి వద్ద జంక్షన్ పనులు పూర్తి చేయడం ద్వారా భవిష్యత్‌లో సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడొచ్చని అధికారులు భావిస్తున్నారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమై, ఆదివార సాయంత్రం ఆరు గంటల వరకు ఈ మరమ్మతు పనులు జరగనున్నాయి. అందుకే పంపింగ్ పూర్తిగా బంద్ చేయనున్నారు.
పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం
— HMWSSB (@HMWSSBOnline) January 8, 2026
==========================
హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2 లోని కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌పై 200 మిమీ డయా ఎంఎస్ పై ఏర్పడిన లీకేజీని అరికట్టడం, దెబ్బతిన్న 2375 మిమీ… pic.twitter.com/90xckQcGkk
నీటి సరఫరా బంద్ అయ్యేది ఈ ప్రాంతాల్లోనే
ఈ 36 గంటలపాటు కృష్ణా రెండో దశ జలాలపై ఆధారపడే దాదాపు సగం నగరంపై ప్రభావం పడనుంది. ప్రధానంగా తూర్పు, దక్షిణ హైదరాబాద్‌తోపాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుంది. ప్రభావితమయ్యే ప్రాంతల జాబితాను ఒకసారి పరిశీలిస్తే...
తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు: వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలీనగర్, నాగోల్, బడంగ్‌పేట్, లెనిన్ నగర్, ఆదిభట్ల, కమ్మగూడ, బాలాపూర్
పాతబస్తీ- దక్షిణ ప్రాంతాలు: బర్కాస్, మైసారం, యెల్లుగుట్ట, శాస్తరిపురం, నేషనల్ పోలీస్ అకాడమీ పరిసరాలు
సికింద్రాబాద్, ఉత్తర ప్రాంతాలు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధి, మేకలమండి, మహేంద్రహిల్స్, తార్నాక, లాలాపేట, మారేడుపల్లి, గౌతమ్‌నగర్, హస్మత్‌పేట్
ఇతర కీలక ప్రాంతాలు: నాచారం, బౌద్ధనగర్, నల్లగుట్ట, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, ఫిరోజ్‌గూడ, మధుబన్, ప్రశాసన్‌నగర్, ఎఈఎస్, రైల్వేల పరిధిలోని ప్రాంతాలు
ప్రజలు తీసుకొవాల్సిన జాగ్రత్తలు
ఒక్కసారి నీటి సరఫరా నిలిచిపోతే, మరమ్మతులు ముగిసిన తర్వాత కూడా లైన్‌లలో ప్రెషర్ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి నగరవాసులు ఈ క్రింది సూచనలు పాటించడం ఉత్తమం.
శుక్రవారం రాత్రి లోపు లేదా శనివారం ఉదయం ఆరు గంటలకు ముందే అవసరమైన మేర నీటిని నిల్వ చేసుకోవాలి.
సరఫరా పునరుద్ధరించే వరకు నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలి.
అవసరమైతే జలమండలి ట్యాంకర్ల కోసం ముందస్తుగా బుక్ చేసుకోవడం మంచిది.





















