Hyderabad: సహజీవనం మోజులో ముగ్గురు జూనియర్ ఆర్టిస్ట్‌లు! ఒకరితో నాలుగేళ్లు - ఇంకొకరితో 4 నెలలు
సహజీవనం చేస్తున్న జూ.ఆర్టిస్ట్‌లు విడిపోయారు. ఆమె మరో జూ.ఆర్టిస్ట్‌తో వెళ్లిపోయింది. అది తట్టుకోలేని యువకుడు గొడవకు దిగాడు. కొత్త ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని యువతి భవనంపై నుంచి తోసేసింది.
జూనియర్ ఆర్టిస్టులుగా పని చేసేవారు ఒక్కటయ్యారు.. నాలుగేళ్లు సహజీవనమూ చేశారు. గొడవల కారణంగా విడిపోయారు. ఆమె మరో వ్యక్తితో సహజీవనానికి వెళ్లిపోయింది. అది తట్టుకోలేని యువకుడు గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే కొత్త ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని యువతి భవనంపై నుంచి కిందకు తోసేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని శ్రీ కృష్ణానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుమల్ రెడ్డి సూర్యనారాయణ అనే 30 ఏళ్ల వ్యక్తి సినిమాలపై ఆసక్తితో చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ శ్రీ కృష్ణానగర్‌లో నివాసం ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం అతనికి ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ నాగవర్ధిని పరిచయం అయింది. అది క్రమంగా ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సహ జీవనం చేసేదాకా వరకూ వ్యవహారం వెళ్లింది. అతను తొలుత అద్దెకు ఉన్న బిల్డింగులోనే ఈ ఇద్దరూ కలిసి సెకండ్ ఫ్లోర్‌లో గత నాలుగేళ్లుగా నివాసం ఉంటూ సహజీవనం చేస్తున్నారు.
నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఎవరికి వారు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సూర్యనారాయణ అదే భవనంలో ఆమె నుంచి విడిపోయి ఫోర్త్ ఫ్లోర్‌లోని మరో పోర్షన్‌కి మారిపోయి విడిగా ఉంటున్నాడు. ఈ లోపు నాగవర్ధినికి రాజమండ్రికి చెందిన మరో జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డితో పరిచయం ఏర్పడి అది కూడా ప్రేమగా మారింది. ఈ ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా ఒకే రూంలో ఉంటున్నారు.
గొడవ పెట్టుకున్న సూర్యనారాయణ
ఈ విషయం సూర్యనారాయణకు తెలియడంతో నాగవర్థినిని అతను నిలదీశాడు. శ్రీనివాస్ రెడ్డితో సహజీవనం మానుకోవాలని తనతో పాటే ఉండాలని గట్టిగా చెప్పాడు. అయినా ఆమె వినలేదు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సూర్యనారాయణ నాగవర్థిని గదిలోకి వెళ్లాడు. లోపల శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధిని ఇద్దరూ కనిపించడంతో వారితో గొడవ పెట్టుకున్నాడు. ముగ్గురి మధ్యా మాటా మాటా పెరగడంతో నాగవర్థిని, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ కలిసి సూర్యనారాయణను అదే ఫ్లోర్ పై నుంచి కిందికి తోసేశారు.
నాలుగో ఫ్లోర్ నుంచి కింద పడడంతో సూర్యనారాయణకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అతని పక్కటెముకలు విరిగిపోయి ఓ ఎముక ఊపిరితిత్తుల్లో గుచ్చుకుందని, అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడిని పంజాగుట్టలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం స్థానికుల ద్వారా పోలీసులకు తెలియడంతో నిందితులు శ్రీనివాస్ రెడ్డి, నాగవర్ధినిలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా చేయగా, అప్పటికే నాగవర్ధినికి వివాహం జరిగినట్లు తేలింది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.