Hyderabad e-Prix 2023: ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ - బుక్ మై షోలో టిక్కెట్లు
Hyderabad e-Prix 2023: హైదరాబాద్ లో ఫిబ్రవరి పదకొండో తేదీ నుంచి ఫార్ములా ఈ రేస్ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. బుక్ మై షోలో టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచబోతున్నారు.
Hyderabad e-Prix 2023: తెలంగాణ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫార్ములా ఈ రేస్ త్వరలోనే జరగబోతోంది. ఫిబ్రవరి పదకొండో తేదీ నుంచి రేస్ నిర్వహిస్తుండగా... అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ తీరాన రయ్ మంటూ స్పోర్ట్స్ కార్లు దూసుకెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ఐమ్యాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్లు దీనికోసం సర్క్యూట్ ను తీర్చిదిద్దారు. అటు లేజర్ షో, ఇటు ఫార్ములా ఈ రేస్ జరగనుండడంతో ట్యాంక్ బండ్ ప్రాంతం పలు పనులతో బిజీగా మారిపోయింది. ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ రేస్ జరగనుంది. ఈసారి తెలంగాణ అభివృద్ధి సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, సచివాలయం, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా 2.8 కిలో మీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఫార్ములా ఈ రేస్ టికెట్లను బుక్ మై షోలో అందుబాటులో ఉంచనున్నారు.
🇮🇳 IT’S HAPPENING! The Hyderabad E-Prix has been given the green light! Our first ever home race will take place on 11th February 2023.
— Mahindra Racing (@MahindraRacing) June 29, 2022
More info coming soon! @anandmahindra @KTRTRS @FIAFormulaE pic.twitter.com/FZexYVvh32
ఫార్ములా ఈ రేస్ లో పాల్గొననున్న 22 మంది డ్రైవర్లు
ఫిబ్రవరి 11వ జరగనున్న ఈ రేస్ కోసం తుది మెరుగులు దిద్దుతున్నారు. పక్కన బారికేడ్లకు రంగులు అద్దుతున్నారు. 11 ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలకు చెందిన ఎలక్ట్రికల్ కార్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. 22 మంది డ్రైవర్లు తమ సత్తా చాబోతున్నారు. వారం రోజుల ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. స్ట్రీట్ సర్క్యూట్ కు రెండు వైపులా భారీ ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లతో పాటు వీఐపీల గ్యాలరీల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే బుక్ మై షోలో ఈ రేస్ ఫార్ములాకు సంబంధించిన టికెట్లు అమ్మకానికి పెట్టారు. పోటీలకు తరలివచ్చే దేశ, విదేశీ పర్యాటకుల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ సరికొత్త హంగులు తీసుకొస్తున్నారు.
ఈ రేస్ ను ఉచితంగా కూడా వీక్షించే అవకాశం..
హుస్సేన్ సాగర్ లోపల 7 కోట్లతో నీటిపై తేలే మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించి పనులు కొలిక్కి వచ్చాయి. పోటీలు జరిగే నాలుగైదు రోజుల ముందు ఇవి ప్రారంభం కానున్నాయి. లేజర్ షోలో హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు తెలిపే ఘట్టాలను ప్రదర్శించనున్నారు. పర్యాటక శాఖ నడిపే పడవల్లో వెళ్లి తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాక రోడ్డుపై నిలబడి పర్యాటకులు ఉచితంగానే ఈ షోను వీక్షించవచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫార్ములా ఈ రేస్ తర్వాత మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో కొనసాగనుంది. ఈ రేస్, కోసమే కాకుండా మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో కోసం భాగ్యనగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.