Hyderabad Crime News: 20 చోరీలకు పాల్పడ్డ దొంగ అరెస్ట్ - 32 తులాల బంగారం, 1.30 కిలోల వెండి, పదిహేను లక్షలు స్వాధీనం!
Hyderabad Crime News: సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలు చేశాడు. జైలుకు వెళ్లొచ్చినా మళ్లీ చోరీలు చేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
Hyderabad Crime News: సులభంగా డబ్బులు సంపాదించాలని లక్ష్యంతో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఏడు సార్లు అత్యాచారం కేసులో కూడా అతడు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా 20 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. నిందితుడి వద్ద నుంచి 32 తులాల బంగారు ఆభరణాలతో పాటు1.30 కిలోల వెండి, 15 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిదంటే..?
సులభంగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న 34 ఏళ్ల కమ్మ సింగ్... తరచుగా దొంగతనాలకు పాల్పడుతుంటాడు. గతంలో చాలా సార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఇతడు.. అత్యాచారం కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. చాలా రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. అయిన అతని తీరు మార్చుకోకుండా విడుదలైన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడడం ప్రారంభించాడు. జంట నగరాల్లోని కమీషనరేట్ల పరిదిలో 20కి పైగా ఇళ్లలో దొంగతనాలు చేశాడు. జనవరి 31వ తేదీన అర్థరాత్రి చింతల్ లో ఓ ఇంట్లో దొంగతనం జరిగినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న 10 తులాల బంగారంతో పాటు 10 లక్షల నగదు చోరికి గురైనట్టు వివరించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టి పోలీసులు సురారంలో మంగళవారం నిందితుడు కమ్మ సింగ్ కనిపించగా అరెస్ట్ చేశారు. నిందితుడిపై జంట నగరాల కమిషనరేట్ లతో పాటు కామారెడ్డి పోలీస్ స్టేషన్ తో కూడా కేసులు నమోదైనట్లు డీసీపీ బాలనగర్ తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు కమ్మ సింగ్ నుండి 32 తులాల బంగారు ఆభరణాలతో పాటు1.30 కిలోల వెండి, 15 లక్షల నగదును సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్టు మీడియాకు తెలిపారు.
వరంగల్ లోనూ ఇలాంటి ఘటనే..!
గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడిన ఓ దొంగతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన ఐదుగురు నిందితుల నుంచి సుమారు రూ.17 లక్షలకు పైగా విలువైన 330.7 గ్రాముల బంగారం, 115 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.
జల్సాల కోసం దొంగతనాలు
గతేడాది డిసెంబర్ లో వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడారు. పోలీసులు కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని సంకెపల్లి గ్రామానికి చెందిన జింక నాగరాజు చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించడానికి దొంగతనాలకు ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 2010 నుంచి నాగరాజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తనను గుర్తుపడతారని చోరీల కోసం ఇతర ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలోని నర్సంపేట, గీసుకొండ ప్రాంతాల్లో గేటుకి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గత రెండు సంవత్సరాల నుంచి పలు దొంగతనాలు చేశాడు. చోరీల్లో దొంగిలించిన బంగారం, వెండి నగలు, ఇతర సొమ్మును వేములవాడ పరిసర ప్రాంతాలకు చెందిన తన మిత్రులైన నాగుల ప్రవీణ్, కట్ట రాజు, ఉల్లందుల ప్రశాంత్, వల్లంపట్ల పరమేష్ ద్వారా అమ్మాడు.