Hyderabad Flyovers Closed: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్- హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు మూసివేత, పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
Happy New Year 2024: తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
New Year Traffic Police Rules : తెలంగాణలో కొత్త సంవత్సర (News Year) వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా చిన్నా పెద్దా భేదం లేకుండా అంతా న్యూ ఇయర్ సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్బంగా హైదరాబాద్ (Hyderabad)లోని పలు ఫ్లైఓవర్లను పోలీసులు మూసివేశారు. షేక్ పేట్, మైండ్ స్పేస్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు రెండు, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్-జెఎన్ టీయూ బ్రిడ్జ్ లను రాత్రి 11 గంటలకు మూసివేశారు. జనవరి 1న ఉదయం 5గంటల వరకూ క్లోజ్ చేయనున్నారు. అర్ధరాత్రి 12గంటల తర్వాత నగరంలోని ఫ్లైఓవర్లతో పాటు ఓఆర్ఆర్ మూసి వేయనున్నారు.
వాహనాలు దారి మళ్లింపు
ఫ్లైఓవర్లను మూసివేయనున్న అధికారులు.. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌వైపు రాత్రి 10గంటల నుంచి 2 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధించారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను సెన్షెషన్ థియేటర్ మీదుగా లక్డీకాపూల్ వైపు మళ్లించనున్నారు. ఖైరతాబాద్ వి.వి.విగ్రహం కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు, ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా రాజ్‌భవన్ వైపు వాహనాలకు అనుమతి లేదు. బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనదారులు తెలుగుతల్లి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. నెహ్రూ ఔటర్ రింగ్, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై వెళ్లేవారు విమానం టికెట్ చూపిస్తే ఆర్‌జీఐఏ విమానాశ్రయానికి అనుమతించనున్నారు.
తాగి వాహనం నడిపితే అంతే...
డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ద్విచక్రవాహనాలపై త్రిపుల్ రైడింగ్ ఇతర ఉల్లంఘనలను అరికట్టడానికి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. సరైన పత్రాలు లేకపోతే వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేయనున్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.
అర్ధరాత్రి దాకా మెట్రో సర్వీసులు
నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి అర్ధరాత్రి 12.15 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరి 1 గంటకు చివరి స్టేషన్‌కు చేరుకోనుంది. మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకోనున్నారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా పెట్టారు.