BRS MLA: అప్పట్లో బిందెలతో బావులు, బోర్ల దగ్గరికి! కేసీఆర్ పాలనతో ఇంటింటికీ తాగునీరు
2014 కు ముందు తాగునీరు కోసం బిందెలు పట్టుకుని మహిళలు బావుల దగ్గరికి, బోర్ల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండేదని అలాగే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేవారని గుర్తుచేశారు.
Husnabad MLA Satish Kumar:
అభివృద్ధిలో అగ్రపథాన కొనసాగుతూ జాతీయస్థాయిలో హుస్నాబాద్ మెరిసిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమం హుస్నాబాద్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014 కు ముందు తాగునీరు కోసం బిందెలు పట్టుకుని మహిళలు బావుల దగ్గరికి, బోర్ల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండేదని అలాగే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేవారని గుర్తుచేశారు. మహాసముద్రం గండి పూడ్చడం ద్వారా హుస్నాబాద్ ప్రాంతంలో భూగర్భజల నీటి వనరులు పెరిగి అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వడం ద్వారా సమస్య తీరిందన్నారు.
హుస్నాబాద్ పట్టణాన్ని నగర పంచాయతీ నుండి మునిసిపాలిటీగా చేయడం ద్వారా అభివృద్ధి చాలా వేగంగా జరుగుతూ జాతీయస్థాయిలో అత్యంత అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ అవార్డును కూడా సొంతం చేసుకున్నామని చెప్పారు. ఇదంతా ప్రజా ప్రతినిధుల, అధికారుల కృషి అలాగే ప్రజల సమన్వయంతో సాధ్యమైందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ పట్టణానికి జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో అవార్డులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లో పట్టణం పారిశుద్ధ్యం నందు మెరుగైన ప్రతిభను కనపరిచి ఫాస్టెస్ట్ మూవర్స్ సిటీ అవార్డు సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ 2022 లో బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డును సాధించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఫలితాలు..
ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యం, స్వచ్ఛత, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 'పట్టణ ప్రగతి' కార్యక్రమం తెలంగాణలోని పట్టణాలు, మున్సిపాలిటీలను ప్రగతి పథంలో నిలిపిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయిందని దీంతో హుస్నాబాద్ పట్టణం ఇప్పుడున్న దానికంటే మరో మూడింతలు అభివృద్ది చెందనుందని తెలిపారు. అంతకుముందు మున్సిపల్ సిబ్బంది, కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు. మహిళా సంఘాలకు డ్వాక్రా రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మున్సిపల్ సిబ్బంది శాలువాతో, గజమాలతో ఘనంగా సత్కరించారు.
ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుల ఆందోళన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని మంటెస్సోరి ప్రైవేట్ పాఠశాల ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల యాజమాన్యం యూనిఫామ్, పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక ఎంఈఓకు సమాచారం ఇవ్వగా అధికారులు స్పందించి పుస్తకాలు యూనిఫామ్ ఉన్న పాఠశాల గదిని సీజ్ చేశారు.
ఏబివిపి విద్యార్థి సంఘం నాయకుడు ఆదిత్య మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో లాభార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను వ్యాపారం చేస్తున్న అధికారులు స్పందించకపోవడం బాధాకరమని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.