Harish Rao: కాళేశ్వరం కమిషన్ అన్ని ప్రశ్నలకు ఆధారాలతో సహా సమాధానం చెప్పాను: హరీష్ రావు
Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పానని, మొత్తం 20 ప్రశ్నలు అడిగనట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.

Telangana News | హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఎదుట హరీష్ రావు హాజరుకాగా, గంటన్నరపాటు విచారణ జరిగింది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు హరీష్ రావు తెలిపారు. మొత్తం 20 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడగగా.. ఆధారాలతో సమాధానాలు సమర్పించారు హరీష్ రావు. మాజీ మంత్రి ఇచ్చిన సమాధానాలకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు హరీష్ రావు. విచారణకు సంబంధించి అడిగిన ప్రశ్నలు, వివరాలపై వెల్లడించనున్నారు.
కేసీఆర్, హరీష్ రావు, ఈటలకు నోటీసులు
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నాణ్యతా లోపం ఆరోపణలతో విచారణకుగానూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని, అంచనా వ్యయం పెరిగిందని, భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కాళేశ్వరంపై విచారణ కమిషన్ గత నెలలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లకు నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం నిర్మాణం సమయంలో కేసీఆర్ సీఎం కాగా, ఆర్థికశాఖ మంత్రిగా ఈటల రాజేందర్, నీటిపారుదలశాఖా మంత్రిగా హరీష్ రావు ఉన్నారు.
పీసీ ఘోష్ కమిషన్ ఇదివరకే 109 మంది అధికారులు, ఉద్యోగులు, నేతలను విచారించి పలు వివరాలు సేకరించింది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం విచారణ కమిషన్ గడువును పలుమార్లు పొడిగించింది. ఈ క్రమంలో కేసీఆర్, ఈటల రాజేందర్, హరీష్ రావులకు నోటీసులు ఇవ్వగా.. జూన్ 5న ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక శాఖ పాత్ర సాధారణం అని, పరిమితి తక్కువే నన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, అప్పటి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం, తుది ఆమోదంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు ఈటల అన్నారు. తాజాగా హరీష్ రావు విచారణకు హాజరై కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. జూన్ 11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.






















