Hyderabad Police: ఏఐ టూల్సుతో పరిచయస్తుల్లా వీడియో కాల్స్- సైబర్ కేటుగాళ్ల కొత్త అస్త్రం- జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
Hyderabad Police: ఏఐ టూల్స్ వాడుతూ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీడియో కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు.
Hyderabad Police: ఆన్ లైన్ వాడకం పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇంట్లో దొంగతనాలు, దారి దోపిడీలు ఈ మధ్యకాలంలో చాలా తగ్గాయి. వాటి స్థానంలో ఆన్ లైన్ మోసాలు వచ్చాయి. ఎక్కడో కూర్చొని ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు కాజేస్తున్నారు. ఈ ఆన్ లైన్ మోసాల్లో రోజుకో కొత్త పద్ధతి పుట్టుకొస్తుంది. ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న అత్యాధునిక టెక్నాలజీ అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) టూల్స్ ను వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు నెటిజన్లను హెచ్చరిస్తున్నారు.
Using #ArtificialInteligence (#AI) apps and a photo of a person can make a video calls with the face of the person in the PIC, so #Beware of fake video calls from #Fraudsters...#CyberFraudsters #VideoCallScam
— Hyderabad City Police (@hydcitypolice) July 28, 2023
Credits - Respective owner. pic.twitter.com/a3jfGKva7L
ఏఐ పవర్డ్ ఫేస్ స్వాపింగ్, డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ మోసాలు చేస్తున్నారు. మనకు తెలిసిన వారిలాగే కనిపిస్తారు, మాట్లాడతారు. ఆపదలో ఉన్నామని, ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు, ఆక్సిడెంట్లు జరగాయని ఇలా ఏదో ఓ కారణం చెప్పి డబ్బు అడుగుతారు. వీడియో కాల్ లో మాట్లాడటం, మనం నేరుగా చూస్తూనే ఉంటాం కాబట్టి ఎలాంటి అనుమానం కూడా రాదు. అలా మోసాలు చేస్తుండటం ఈ మధ్యకాలంలో పెరుగుతున్నట్లు పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా వ్యక్తి చిన్న పాస్ పోర్టు సైజ్ ఫోటో దొరికినా చాలు మోసం చేయడానికి. ఆ ఫోటో సాయంతో.. ఏఐ టూల్స్ వాడి వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా వీడియో క్రియేట్ చేస్తారు. సామాన్యులు ఆ వీడియో కాల్ నిజమో, కాదో గుర్తించలేని విధంగా.. నిజానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఫేక్ వీడియో. దాని వల్ల సులభంగా మోసం చేయగలుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇటీవలే 30 లక్షల దోచేసిన 3 ముఠాలు
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 20 వేల మందికిపైగా ప్రజలు మోసం చేసి.. దాదాపు 30 లక్షల రూపాయలు కాజేసిన 3 ముఠాలను తెలంగాణలోని సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని బేగంపేట పోలీసులు ఈ సైబర్ క్రైమ్ మోసగాళ్లను అరెస్టు చేశారు. వీరు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల మందిని మోసగించినట్లు గుర్తించారు. న్యూడ్ వీడియోలు, ఫోటోలు, సెక్స్ చాట్ లు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. వీరి టార్గెట్ అంతా సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్న పురుషులే. మహిళల పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు. ఆకట్టుకునే ఫోటోలను ప్రొఫైల్ పిక్ గా పెడతారు. వాటిని చూసి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిన వారిని అలాగే వీరు మరికొందరికి పంపి క్రమంగా ముగ్గులోకి దించుతారు.
పోలీసులు పట్టుకున్న వారిలో ఒక ముఠాలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు కాగా, మరొకరు మొబైల్ ఫోన్ దుకాణంలో పని చేసే వ్యక్తి ఉన్నారు. నలుగురు సభ్యులు కలిగిన రెండో ముఠాలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్ గా మారిన రైతు, ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని ఉన్నారు. ఈ రెండు ముఠాలు సుమారు మూడేళ్లుగా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. షేర్ చాట్ యాప్ లో మహిళల పేర్లతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించారు. పురుషులతో స్నేహం చేస్తారు. తర్వాత వారితో చాటింగ్ మొదలు పెడతారు. వారికి న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తారు. వీడియో కాల్స్, నార్మల్ కాల్స్ చేస్తే కట్ చేసి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటారు. పదే పదే కాల్ చేసే వారిని బ్లాక్ చేస్తారు. న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలంటే 500 నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తారు. అలా దాదాపు 19 వేల మందిని మోసం చేసి దాదాపు 30 లక్షల వరకు కాజేసినట్లు పోలీసులు చెబుతున్నారు.