![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Home Guard Ravinder suicide: ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత-హోంగార్డు రవీందర్ కుటుంబసభ్యుల ఆందోళన
హోంగార్డు రవీందర్ ఆత్మహత్యతో తెలంగాణ రగులుతోంది. ఆత్మహత్య కాదు.. హత్య అని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఆందోళన చేస్తున్నారు.
![Home Guard Ravinder suicide: ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత-హోంగార్డు రవీందర్ కుటుంబసభ్యుల ఆందోళన Flaring up Home guard Ravinder issue in Telangana Family members protest alleging it was a murder protest in Osmania Hospital Heavy security at Osmania Hospital Home Guard Ravinder suicide: ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత-హోంగార్డు రవీందర్ కుటుంబసభ్యుల ఆందోళన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/08/350e11bc08f421c51db7f78a956583af1694159799456841_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన హోంగార్డు రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో ఉంచారు. కాసేపట్లో రవీందర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు.. హోంగార్డు రవీందర్ భార్య సంధ్య.. తన పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తన భర్తను ఆత్మహత్య కాదని.. ఉన్నతాధికారులు చేసిన హత్య అని ఆరోపిస్తున్నారు ఆమె. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేధించి, ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. తన భర్త ఫోన్‌ను తీసుకున్న పోలీసులు.. అందులోని డాటా మొత్తం డిలీట్ చేశారు సంధ్య చెప్తున్నారు.
తన భర్త రవీందర్ మృతికి... ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందునే కారణమని ఆరోపిస్తున్నారు సంధ్య. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని.. అసలు ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రశ్నించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో హోంగార్డ్ ఆఫీసర్ హైమద్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. ప్రీప్లాన్డ్‌గా తన భర్తను చంపారని అంటున్నారామె. రవీందర్ కుమారుడు కూడా తన తండ్రి మృతికి ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందూనే కారణమని చెప్తున్నాడు.
మరోవైపు హోంగార్డు రవీందర్ మృతికి నిరసనగా.. హోంగార్డుల జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆయన కుటుంబానికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. హోంగార్డులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేయబోతున్నారు. రవీందర్ మృతదేహంతో సచివాలయానికి వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఆందోళనతో ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత కనిపిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు హోంగార్డులు ఆందోళనకు దిగకుండా... ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. హోంగార్డులు అందరూ విధుల్లోనే ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అంతేకాదు.. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల బాధ్యతలను ఎస్సైలకు అప్పగించారు. హోంగార్డులు అందరూ విధులకు హాజరయ్యేలా చూడాలని హుకుం జారీ చేశారు. విధులు కేటాయించని వారంతా పోలీస్ స్టేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)