![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. నాలుగో అంతస్తులో ఎగసిపడ్డ మంటలు, ఘటనపై మంత్రి ఆరా
సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు.
![Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. నాలుగో అంతస్తులో ఎగసిపడ్డ మంటలు, ఘటనపై మంత్రి ఆరా Fire accident in Gandhi Hospital 5th floor, Patients shifted to another ward Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. నాలుగో అంతస్తులో ఎగసిపడ్డ మంటలు, ఘటనపై మంత్రి ఆరా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/20/77195d9f83f99addf63c6e0ba60824ac_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిత్యం రోగులతో కిటకిటలాడుతూ ఉండే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి భవనంలోని నాలుగో అంతస్తులో ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రాజుకున్నాయి. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చెందారు. ఈ ఘటనతో ఆస్పత్రిలోని 5వ అంతస్తు వరకు పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి సిబ్బంది.. తక్షణం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు పరిశీలించి.. రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి ప్రాణ నష్టం లేదు
విద్యుత్ ప్రధాన బోర్డుల్లో కేబుల్స్‌లో మంటలు చెలరేగాయని, ఆ వైర్లు కాలిపోయాయని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే రోగులకు ఇబ్బంది కలగకుండా బయటకు పంపించామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని వెల్లడించారు. గాంధీ సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే కరెంటు సరఫరా నిలిపివేశామని వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో ఆస్పత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
మరోవైపు, ఈ ప్రమాదంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. నేడు ఉదయం ఆస్పత్రిలోని విద్యుత్‌కు సంబంధించిన గదిలో అగ్నిప్రమాదం జరిగిందని, కేవలం నిమిషాల వ్యవధిలోని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు రాజారావు విలేకరులకు చెప్పారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో కొంత మంది సిబ్బందికి ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలా స్పందించాలో అనేదానిపై శిక్షణ ఇచ్చామని అన్నారు.
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
ఆరా తీసిన మంత్రి తలసాని
సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగుల వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం తాను హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీ ఆస్పత్రిని సందర్శిస్తానని చెప్పారు.
Also Read: Gold Smuggling: బ్యాటరీలలో 2.9 కోట్ల బంగారం.. అలా చేశారు.. ఇలా దొరికిపోయారు
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)