Ande Sri : ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత - సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
Writer Ande Sri : ప్రముఖ రచయిత, 'జయ జయహే తెలంగాణ' సృష్టికర్త అందెశ్రీ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబీకులు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Famous Writer Ande Sri Passed Away : ప్రముఖ రచయిత, కవి, తెలంగాణ రాష్ట్ర గీత 'జయ జయహే తెలంగాణ' సృష్టికర్త అందెశ్రీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై తన నివాసంలో స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, రాజకీయ, సాహిత్య ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అందెశ్రీ ప్రస్థానం ఇదే
సిద్ధిపేట జిల్లా రేబర్తిలో అందెశ్రీ జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రయాణం ప్రారంభించిన ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. పాఠశాలలో చదవకుండానే కవిగా అనేక రచనలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 'మాయమైపోతున్నడమ్మా' గీతంతో మంచి గుర్తింపు తెచ్చుకుని... కాకతీయ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందెశ్రీ కలం నుంచి జాలువారిన 'జయ జయహే తెలంగాణ' గీతాన్ని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున రూ.కోటి నగదు పురస్కారం అందించారు.
సాధించిన పురస్కారాలు
కాకతీయ వర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌తో పాటు 2006లో వచ్చిన 'గంగ' సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథీ సాహిత్య పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో నకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు అందెశ్రీ. ఆయన రచనలు తెలంగాణ ప్రకృతి వంటి అంశాలపై ఎక్కువగా ఉండేవి. ఉద్యమం సమయంలో ప్రజల్లో గొప్ప చైతన్యం నింపాయి. ఆయన గేయాలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.
సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటని రేవంత్ అన్నారు. 'ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచింది. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది' అంటూ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.






















