బీజేపీ అధినాయకత్వం నుంచి ఈటలకు పిలుపు, కీలక పదవి అప్పగించే ఛాన్స్ !
త్వరలోనే తెలంగాణలో బడానాయకుల పర్యటించనున్నారు. ఆలోపు పార్టీలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే చేరికల కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న ఈటలకు మరో కీలకమైన బాధ్యతలు అప్పగించాలని సంకల్పించారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత డైలమాలో ఉన్న తెలంగాణ బీజేపీపై అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈటల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీ పిలిచిన అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించబోతుందని సమాచారం. ప్రచార కమిటీని ఏర్పాటు చేసి ఆయన దాని బాధ్యతలు అప్పగించనున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ అధినాయకత్వం ప్లాన్ చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. బడా నేతలు ఉన్నప్పటికీ వారెవరు కూడా సంతృప్తిగా లేరన్న వాదన బలంగా ఉంది. అందుకే అలాంటి వారిని గుర్తించి వారికి సరైన ప్రాధాన్యత ఇస్తూ పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ.
త్వరలోనే తెలంగాణలో బడానాయకుల పర్యటించనున్నారు. ఆలోపు పార్టీలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే చేరికల కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న ఈటలకు మరో కీలకమైన బాధ్యతలు అప్పగించాలని సంకల్పించారు. అందుకే ఆయన్ని ఢిల్లీ పిలిచి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
కోవర్టు వ్యాఖ్యలతో కాక
ఈ మధ్య తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత అసలే పార్టీ సమస్యల్లో ఉంటే ఇప్పుడు నేతల మధ్య విభేదాలు పుండు మీద కారం చల్లినట్టు ఉంటోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పార్టీ నేతల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముఖ్యంగా వేరే పార్టీల నుంచి చేరిన వారు పక్కచూపులు చూస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరికొందరు ఆపార్టీలో చేరుదామా అన్ని కొన్ని రోజులుగా ఆలోచించిన వాళ్లు ఇప్పుడు బీజేపీ వైపు చూడటానికే ఇష్టం పడటం లేదు. ఆ పార్టీలో ఉన్న వారిని ఎలా బయటకు లాగుదామా అని ఆలోచిస్తున్నారట.
కోవర్టులు కొంపముంచుతున్నారా?
ఉన్న వాళ్లు బయటకు రావడానికైనా... వేరే పార్టీ వాళ్లు బీజేపీలోకి వెళ్లకపోవడానికైనా చెప్పే ఒకే ఒక కారణం కోవర్ట్. అదే కేసీఆర్ మనుషులు బీజేపీలో ఉన్నారని అక్కడ జరిగే పరిణామాలు, చేరికలు, ఇతర సమాచారాన్ని బీఆర్‌ఎస్‌కు ఉప్పు అందిస్తున్నారని ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నమాట.
ఆకర్ష్ ఫెయిల్
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఇతర పార్టీ నేతలకు గాలం వేసేందుకు ఏర్పాటు చేసిన చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల సైతం విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పొంగులేటి, జూపల్లి వంటి కీలకనేతలను బిజేపిలోకి లాగేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అంతే కాదు వారిని ఆహ్వానించడానికి వెళ్లిన ఈటెలను, నువ్వే కాంగ్రెస్‌లోకి వచ్చేయమంటూ ఒప్పించే ప్రయత్నం చేసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మరికొందరు పక్కచూపులు
ఇలా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తామంటూ ఏర్పడ్డ బీజేపీ చేరికల కమిటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు పచ్చగడ్డి వెయ్యకున్నా భగ్గుమంటూనే ఉన్నాయి. ఈటెలకు వ్యతిరేకంగా బండి టీమ్ పని చేస్తుందనే విమర్శలు ఓవైపు. పార్టీలో ఉండాలా పొంగులేటి చెప్పినట్లు గోడ దూకేద్దామా అనే సందేహం ఈటెల ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే అధినాయకత్వం అర్జెంటుగా ఆయన్ని పిలిచి మాట్లాడుతోందని వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆయన అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డారు. ఇప్పట్లో బండి సంజయ్‌ను మార్చే ఉద్దేశం లేదని అధినాయకత్వం చెప్పడంతో ఆయన అప్పటి నుంచి కాస్త సైలెంట్ అయ్యారు. వీటన్నింటినీ గమనించిన అధిష్ఠానం ఈటలను పిలుపించింది.