E Bikes: స్క్రాప్ నుంచి ఈ-బైక్స్ రూపొందిస్తున్న హైదరాబాదీ, స్పెషాలిటీ తెలిస్తే వావ్ అనాల్సిందే
పాత బైక్‌లను ఎలక్ట్రానిక్ వాహనాలుగా మారుస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మాజ్ అహ్మద్ ఖాన్. గత ఏడాదిన్నర నుంచి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి కృషి చేస్తున్నారు.
Electric Bikes: మీ దగ్గర ఏదైనా పాత బైక్ ఉందనుకోండి. దాన్ని చాలా మంది త్పరగా తీసేయడానికి ఇష్టపడరు. సెంటిమెంట్ గానో మరొకరికి అమ్మకుండా దాన్నే వాడుతుంటారు. దాంతో ఆ బైక్స్ కాలుష్యానికి కారణం అవుతాయి. అలాంటి స్క్రాప్ కు వెళ్లే బైక్స్ ను ఈ బైక్స్ లా మార్చుకోవచ్చు అంటున్నాడో యువకుడు. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
Hyderabad News: హైదరాబాద్ కి చెందిన ఓ ఇంజినీర్ పాత బైక్‌లను ఎలక్ట్రానిక్ వాహనాలుగా మారుస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాజ్ అహ్మద్ ఖాన్ గత ఏడాదిన్నర నుంచి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి కృషి చేస్తున్నారు. పాత బైక్‌లను పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్‌లుగా మార్చాలని నిర్ణయించాడు. ఈ దిశగా అడుగులు వేస్తూ ఇప్పటివరకు ఎన్నో వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేశాడు.
రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల సంఖ్య మూలంగా నగరం లో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు అటు పోలీసులకు, ఇటు వాహనదారులకు సవాలు విసురుతున్నాయి. ట్రాఫిక్ లో వచ్చే పొల్యూషన్ కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో జనాలకు ఒక రకమైన భయం ఉండిపోయింది. అలాంటివారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వాహనంలో బ్యాటరీతో ప్రమాదం పొంచి ఉందంటే తక్షణమే ఈ వాహనం ఆగిపోతుంది. ప్రమాదం జరిగే అవకాశం అసలు ఉండదు. ఇదే ఈయన చేస్తున్న వాహనాల ప్రత్యేకత
బ్యాటరీ అప్‌డేట్..
ఈ బ్యాటరీ వెహికల్స్ లో రెండు రకాలుగా అమర్చారు.1. ఇంజిన్, తీసేసి ఆ ప్లేస్ లో బ్యాటరీ ని అమర్చడం, 2. ఇంజిన్ తో పాటు పెట్రోల్ వెసులుబాటు అమర్చడం. దాంతో మనకు కావాలనుకునపుడు పెట్రోల్ లేదా బ్యాటరీతో వాహనం డ్రైవ్ చేయవచ్చు. అయితే బ్యాటరీ బాగా వేడేక్కినా, లేదా ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే గుర్తించి ముందుగానే బండి ఆగిపోతుందని అహ్మద్ ఖాన్ చెబుతున్నారు.
సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ వాహనం ధర దాదాపు రూ. 50వేలు ఉంటుంది. ఇది కేవలం ద్విచక్రవాహనమే కాకుండా ఆటో, ఫోర్ వీలర్ తో కూడా మరిన్ని అడుగులు వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నలుమూలల ఈ వాహనంపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన మొదలయింది. ఇప్పటివరకు సుమారు 750 వాహనాల ఆర్డర్ లు వచ్చాయని మాజ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఇలాంటి వాహనాల వాడకంతో క్రమంగా పెట్రోల్ వాహనాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇలా పాత వాటిని రీ మోడల్ చేస్తే కొత్త బైక్ అవసరం ఉండదు. వాటికి రిజిస్ట్రేషన్ చేయాలని పని తప్పుతుంది.
ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. వీటి వల్ల కాలుష్యం ఉండదు కనుక ప్రభుత్వ రాయితీలు పొందవచ్చు. ఎలక్ట్రిక్ బైక్ లకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా సైతం ఈ ఎలక్ట్రిక్ స్కూటీ, ఎలక్ట్రిక్ బైక్‌లను వాడేందుకు ప్రభుత్వాలు నూతన విధానాలు తీసుకొస్తున్నాయి.