డ్రంకన్ డ్రైవ్‌లో దొరికితే ఏం చేస్తారు? ఎవరిపై చర్యలు తీసుకుంటారు : హైదరాబాద్ పోలీసులు ఏమన్నారంటే
నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులతో మర్యాదగా ఉండాలి. ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ కొందరు కాలర్ పట్టుకుంటారు..షర్టు గుంజేస్తారు.మిషన్ పగలగొడతారు.దొరికినవారు తప్పించుకోవడం అసాధ్యం..
నూతన సంవత్సర వేడురల్లో ఇష్టమొచ్చినట్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్. వాహనాలు ఆపితే కొందరు పోలీసులపై దాడులు చేస్తున్నారు.? తాగి నడుపుతూ దొరికిపోయి కూడా పోలీసులపై రివర్స్ అయి రెచ్చిపోతున్నారు.అలా చేస్తే కఠినచర్యలు తప్పవు. ఈసారి హైదరాబాద్ నగరంలో ప్రత్యేక నిఘా ఉంటుందన్న హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ తో ABP దేశం ముఖాముఖి...
ఈరోజు నగరంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎటువంటి ఆంక్షలు ఉంటాయి..?
న్యూ ఇయర్ పార్టీల సందర్భంగా నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపి వారితో పాటు ఇతర ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు. ఈసారి మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకునేందు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. సిటీ వ్యాప్తంగా 120 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతోపాటు, రాత్రి 9గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలు పెడుతున్నాం. పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చేసేవారిని అడ్డుకోవడం మా ఉద్దేశ్యం కాదు. మద్యం తాగేవారు తాగండి, కానీ తాగిన తరువాత వాహనాలు నడిపేందుకు మాత్రం మద్యం తాగనివారి సహాయం తీసుకోవాలని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నాం. తాగి వాహనం నడిపుతూ పట్టుబడిన వారు సంయమనం పాటించాలి. ఈరోజు రాత్రి బేగంపేట, లంగర్ హౌస్ తప్ప అన్ని ఫ్లై ఓవర్స్ మూసివేయనున్నారు. చాలా మంది బైక్ లతో స్టంట్స్ చేస్తుంటారు. న్యూ ఇయర్ అంటూ హంగామా చేస్తుంటారు. అలాంటి వాళ్లను పట్టుకుంటాం. సిసి కెమెరాల నిఘాలో గుర్తించడంతోపాటు, వారిపై సుమోటోగా కేసులు నమోదు చేస్తాం.
ప్రశ్న. మద్యం ఎంత మోతాదు వరకు తీసుకుంటే వాహనం నడపవచ్చు..?
మద్యం తాగినవాళ్లు వాహనం నడపకూడదు అనేది మా విజ్జప్తి. అవగాహన కోసం చెప్పాలంటే 100 మిల్లీ గ్రాముల రక్తంలో 30మిల్లీ గ్రాముల ఆల్కాహాల్ పర్సంటేజ్ దాటితే వారిపై కేసు నమోదు చేస్తాం. ఆల్కోమీటర్ ద్వారా శ్వాస తీసుకున్నప్పడు 30మిల్లీ గ్రామలు దాటకుండా ఉంటే వాళ్లపై కేసులు నమోదు చేయము. అయితే ఎంత మోతాదులో మద్యం తాగితే ఆ పరిధి దాటదనేది మా పరిధిలో అంశం కాదు. మద్యం తాగినవారు వాహనం నడిపేందుకు ప్రవేటు డ్రైవర్లను పెట్టుకోవచ్చు లేదా మాకు కాల్ చేయాలి. ప్రైవేటు ఆటో, టాక్సీలు బుక్ చేసుకుని వెళ్లొచ్చు.
ప్రశ్న. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఏం చేస్తారు..?
ఆల్కాహాల్ పర్సంటేజ్ నిర్దారించుకున్న తరువాత వారిపై కేసు బుక్ చేస్తాం. వారు నడుపుతున్న వాహనం సీజ్ చేసి సంతకం తీసుకుంటాం. వేరే వాహనంలో లేదా బంధువులకు కాల్ చేసి వారిని ఇంటికి పంపుతాం. ఎక్కడా ఇబ్బంది పెట్టేవిధంగా దురుసుగా వ్యవహరించం. గౌరవంగా ఇంటికి వేళ్లేలా చేస్తాం. కోర్టు నుంచి సమన్లు అందిన తరువాత కేసులో జరిమానా, లేదా శిక్ష అనేది ఆల్కాహాల్ పర్సంటేజ్, ఎన్నోసారి పట్టుబడ్డారు అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న. చాలా మంది మద్యం తాగి పట్టుబడ్డవారు నానా హంగామా చేస్తారు.. పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తారు..? ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు..?
నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులతో మర్యాదగా ఉండాలి. ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ కొందరు కాలర్ పట్టుకుంటారు. షర్టు గుంజేస్తారు. మిషన్ పగలగొడతారు. ఆ సమయంలో పోలీసులు సహనం కోల్పోకుండా ఉంటారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికినవారు తప్పించుకోవడం అసాధ్యం. ప్రతీది వీడియో రికార్ట్ అవుతుంది. బ్రీత్ అనలైజర్ డేటా రికార్డ్ అవుతుంది. మా సర్వర్ కు లింక్ అవుతుంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతుంది. కాబట్టి ఎవరీ ఒత్తిడి మాపై పనిచేయదు. మద్యం సేవించి లిమిట్ దాటి దొరికితే జైలుకు వెళ్లక తప్పదు.
పబ్ యజమాన్యాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు..?
పబ్ లకు మైనర్లలను అనుమతించకూడదని ఇప్పటికే నగరంలో అన్ని పబ్స్ యాజమాన్యికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. పబ్ లో ఎక్కడా డార్క్ ఏరియా ఉండకూడదు. అన్ కవర్డ్ ఏరియా ఉండకూడదు. అప్పటికే మద్యం సేవించి పబ్ లోపలికి వచ్చే వారిని అనుమతించకూడదు. అలాంటి వారికి మళ్లీ తాగించకూడదు. మహిళల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటిపంచాలి. ఎవరైనా మద్యం సేవించి వారి కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే మాకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పదే పదే చెప్పామని తెలిపారు.