తెలంగాణకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు- కేంద్రంపై మంత్రి హరీష్ ఆగ్రహం
విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు హరీష్. విద్యుత్ మీటర్లు పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించలేదని తెలిపారు.
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల రుణ పరిమితిపై హైపవర్ ఇంటర్ గవర్నమెంట్ కమిటీ వేసి సమీక్షించాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే కేంద్రం మాత్రం తనకు నచ్చినట్టు సవరించిందన్నారు హరీష్. రాష్ట్రాల నుంచి సభ్యులను చేర్చి ఉంటే సరైన నిర్ణయం జరిగేదని అభిప్రాయపడ్డారు. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు ఉండాలన్నదే కేంద్రం అసలు కుట్రని ఆరోపించారు. రాష్ట్రాలను బలహీనపరచాలనే ఉద్దేశంతో ఏకపక్షంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణలు చేశారన్నారు. ఆ సవరణలను మాత్రం కేంద్రం పాటించదని... రాష్ట్రాలపై మాత్రమే రుద్దే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్రానికో నీతి, రాష్ట్రానికో నీతి ఉంటదా? అని ప్రశ్నించారు హరీష్. కేంద్రం కూడా కార్పొరేషన్ల మీద.. తన రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు పెద్ద ఎత్తున అప్పులు తీసుకురాలేదా అని నిలదీశారు. కేంద్రం అప్పులను మాత్రం రికవరీలో పెట్టలేదని... తాము ప్రభుత్వరంగ సంస్థల నుంచి తీసుకుంటే రికవరీ చేస్తామంటూ అప్పుల తగ్గిస్తున్నారన్నారు.
విద్యుత్ సంస్కరమలు అమలు చేస్తామంటే... అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తామని లేకుంటే ఇవ్వబోమంటూ చెప్పారని గుర్తు చేశారు హరీష్. విద్యుత్ మీటర్లు పెట్టేందుకు, విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించలేదని తెలిపారు. దీని వల్ల అరశాతం అంటే రూ.6104కోట్లు రాష్ట్రం వదులుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ డబ్బు సమకూర్చడం ముఖ్యమా? రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? అని ఆలోచించి 60లక్షల రైతుల ప్రయోజనాలే ముఖ్యమని భావించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రూ.6104 కోట్లు వదులుకొని మూడున్నర శాతం ఎఫ్‌ఆర్‌బీఎంతోని రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ను పొందుపరిచిందని గుర్తు చేశారు.
బడ్జెట్ ఆమోదం తెలిపిన తర్వాత రెట్రాస్పెక్టివ్‌గా బడ్జెట్‌లో కోత పెడుతామంటే.. బడ్జెట్‌ను ఎట్లా అమలు చేయగలుగుతామని ప్రశ్నించారు హరీష్. మొత్తం బడ్జెట్ తలకిందులవుతుంది కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ ఆమోదానికి ముందు చెప్పాల్సినవి తర్వాత చెప్పారన్నారు. ప్రభుత్వాలను సంప్రదించకుండా చర్చించకుండా ఏకపక్షంగా తమకు వర్తింపజేసుకోకుండా కేవలం రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
15వ ఆర్థిక సంఘం చెప్పినట్టే చేస్తున్నామని ఎదురు దాడి చేస్తున్న కేంద్రం నిపుణుల కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. ఒక వేళ కోతలు ఉంటే రాష్ట్రాలతోపాటు కేంద్రానికి కూడా ఉండాలన్నారు. కానీ, కేంద్రానికి విధించకుండా రాష్ట్రాలకు పెట్టడమేంటని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి కొన్ని నిధులు ఇవ్వాలని ఇదే 15వ ఆర్థిక సంఘం చెప్పిందని దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు.
ఏ ఆర్థిక సంఘం రిపోర్ట్ ఇచ్చినా దాన్ని తూ.చా.తప్పకుండా యథావిధిగా గత కేంద్ర ప్రభుత్వాలు అమలు చేశాయని గుర్తు చేశారు హరీష్ రావు. కానీ, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 15వ ఆర్థిక సంఘం 2020-21లో రూ.723కోట్లు ప్రత్యేక గ్రాంట్‌గా తెలంగాణకు ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. పౌష్టికాహారం కోసం రూ.171కోట్లు, 2021-26 మధ్య స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్ల కింద రూ.5,374కోట్లు ఇవ్వమని ఆర్థిక సంఘం సూచించింది. మొత్తంగా 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.6,268కోట్ల ఇవ్వాలని సిఫారసు చేయగా.. ఆమోదించలేదన్నారు.
రాష్ట్రాల రుణపరిమితిని తగ్గించాలన్న దగ్గర మాత్రం ఏకపక్షంగా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే కోతలు పెట్టారన్నారు హరీష్. ఆర్థిక సంఘం ఇవ్వమన్న చోట ఇవ్వకుండా కోతలు పెట్టమన్న చోట మాత్రం పెట్టడం భావ్యమా అని ప్రశ్నించారు. ఇలాంటివి దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నామని ఎద్దేవా చేశారు. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల్లో కేంద్రం తెలంగామకు రూ.817కోట్లు బకాయిపడ్డారని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ చెప్పినా పైసా ఇవ్వలేదన్నారు. 2014-15లో సీఎస్‌ఎస్‌లో తెలంగాణకు ఇవ్వాల్సింది.. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారన్నారు. దీనిపై వందల సార్లు లేఖలు రాశామని వివరించారు.