Jobs Cheating: నెలకు మూడు లక్షల జీతం- వర్క్‌ఫ్రమ్ హోం- హైదరాబాద్‌లోనే ఆఫీస్!
మీలానే చాలా మంది టైటిల్ చూసి సంస్థను సంప్రదించారు. డబ్బులు కూడా కట్టారు. తర్వాత అసలు కథ మొదలైంది.
నమ్మేవాళ్లు ఉన్నంత కాలం మోసగించేవాడు పుడుతూనే ఉంటాడు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగులే టార్గెట్‌గా డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. ఆన్‌లైన్ జాబ్స్, వర్క్ ఫ్రం హోమ్ ఆశ చూపి నిరుద్యోగులను ముగ్గులోకి దించాడు డిజినల్ ఇండియా ఎండీ అమిత్ శర్మ.
హార్డ్ కాపీలను మీకు పంపుతాం.. వాటిని సాఫ్ట్ కాపీలుగా మార్చండి అంతే మీకు నెలకు మూడు లక్షల రూపాయల జీతం ఇస్తామంటూ నమ్మించారు అమిత్‌శర్మ. ఇలా మీకు ఉద్యోగం ఇవ్వాలంటే మా సంస్దలో 5 లక్షల యాభై వేల రూపాయలు డిపాజిట్ చేయాలటూ చెప్పాడు. అలా మీరు డిపాజిట్ చేసిన డబ్బులను కేవలం ఆరు అంటే ఆరు నెలల్లో ఇచ్చేస్తామంటూ మాయ మాటలు చెప్పాడు. ఇంటి వద్దే కూర్చుని చేసే ఉద్యోగం అందులోనూ నెలకు మూడులక్షల రూపాయల భారీ ప్యాకేజి, డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తామంటున్నారుగా అని బోల్తా పడ్డ నిరుద్యోగులు వందల మంది డబ్బులు కట్టారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో డిపాజిట్లు చెల్లించారు. మొదట్లో ఒకరిద్దర్ని నమ్మించడం కోసం డిపాజిట్లు కొంత కట్టించుకుని తిరిగి వారికి ఇచ్చేవాడు అమిత్‌శర్మ. అలా డిజినల్ ఇండియాలో ఏకంగా 700మంది 30కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్ల రూపంలో చెల్లించారు. ముఫై కోట్లు చిక్కాయి.. ఇంకేముంది అనుకున్న డిజినల్ ఇండియా ఎండీ ఉన్నట్లుండి బోర్డు తిప్పి ఉడాయించాడు.
విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. ఇప్పటి వరకూ సిసిఎస్ పోలీసులకు 300 మంది బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో , కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.