తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసిఆర్ వ్యూహం ఫలించిందా?
తెలంగాణ సిఎంకి వ్యతిరేకంగా బీజేపీ అనుకూల మీడియాకు తెలుగుదేశం మీడియా తోడైందని భావించిన కెసిఆర్ ప్రత్యేక వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. దోస్తీ పార్టీలతోపాటు మీడియాకి షాకిచ్చేలా కామెంట్స్ చేశారు.
విమర్శల వెనక ఇంత మ్యాటరుందా? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయవర్గాల్లోనే కాదు తెలుగురాష్ట్రాల రాజకీయాల్లోనూ వినిపిస్తోన్న మాట. ఇంతకీ ఏమిటా విమర్శలు..ఎవరు ..ఎవరిపై చేశారు అన్న విషయంలోకి వస్తే వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో సిఎం కేసిఆర్, మంత్రులు కేటిఆర్, హరీష్ మాట్లాడిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని అందుకోవాలని బీజేపీ ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తోంది. అందులో భాగంగానే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటోంది. అవినీతి, కుటుంబపాలనని ప్రతీ సందర్భంలోనూ గుర్తు చేస్తోన్న కాషాయం ఇప్పుడు లిక్కర్ స్కాంని ఆసారాగా చేసుకొని కెసిఆర్‌ని మరింత దెబ్బతీసేందుకు వ్యూహాలు చేస్తోంది. అయితే ఇలాంటివి ఎన్నో చూశాం…వీటికి భయపడేది లేదని సవాల్ చేస్తూనే టీఆర్‌ఎస్ అధినేత తన స్టైల్ రాజకీయాలను కంటిన్యూ చేస్తున్నారు.
కారుని ఢీ కొట్టేందుకు కాషాయం, కమలాన్ని కానరాకుండా చేయాలని గులాబీదళం చేస్తోన్న ఎత్తుకు పైఎత్తుల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన పాత అస్త్రాన్ని మళ్లీ కెసిఆర్ బయటపెడుతున్నారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కెసిఆర్ తన ప్లాన్‌ని అమలు పరిచారు. ఆంధ్ర సెంటిమెంట్‌ని అడ్డు పెట్టుకొని 2018 ఎన్నికల్లో గెలిచారు. మొదటిసారి తెలంగాణని తేవడంలో కెసిఆర్ ఉద్యమపాత్రని గుర్తు చేసుకొని గెలిపిస్తే రెండోసారి గెలవడం కష్టమనుకుంటున్న టైమ్‌లో చంద్రబాబును అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు కెసిఆర్. ఇప్పుడు ఆ ఫార్మూలానే మళ్లీ తెరపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు తెలంగాణ సిఎం.
ప్రస్తుతం ఏపీలో టిడిపితో కలిసి ఎన్నికల పోరులోకి దిగాలనుకుంటున్న బీజేపీ తెలంగాణలో కూడా చంద్రబాబుని కలుపుకొని పోవాలని చూస్తోంది. అటు బాబు కూడా తెలుగురాష్ట్రాల్లో మళ్లీ తన బలం చూపించాలనుకుంటున్నారు. ఈ క్రమంలో కాషాయం, పసుపుపార్టీలు కలిసి తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల బరిలోకి దిగనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. దీన్నే అవకాశంగా తీసుకున్న తెలంగాణ సిఎం అసెంబ్లీ సమావేశాల్లో కాషాయాన్ని విమర్శిస్తూ టిడిపి అధినేత చంద్రబాబుని కూడా టార్గెట్ చేశారు. మాజీ సిఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారడం వల్లే తెలంగాణకి అన్యాయం జరిగిందంటూ పోలవరం ముంపు మండలాలు, సీలేరు విద్యుత్ కేంద్రం వంటి విషయాలు ప్రస్తావించారని రాజకీయవిశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ విమర్శల మాటలతో అటు చంద్రబాబు ఇటు బీజేపీ రెండింటిని ఇరుకున పెట్టి తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలు ఇవేనంటూ చెప్పే ప్రయత్నం చేశారు.
తెలంగాణ సిఎంకి వ్యతిరేకంగా ఇప్పటికే కాషాయం పార్టీ అనుకూల మీడియాతోపాటు ఇప్పుడు తెలుగుదేశంపార్టీ మీడియా కూడా తోడైందని భావించిన కెసిఆర్ ఇటు ఆ దోస్తీ పార్టీలతోపాటు మీడియా కూడా షాకిచ్చేలా ఇలాంటి విషయాలను తెరపైకి తెస్తున్నారని గుర్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కెసిఆర్ బుర్ర నుంచి ఎలాంటి వ్యూహాలు వస్తాయో చెప్పడం కష్టమంటున్నారు.
తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 11గంటలు సభ జరిగితే అందులో రెండు గంటలు, మిగిలిన దాంట్లో మెజార్టీ భాగం కేటిఆర్, హరీష్ రావే మాట్లాడారు. ముగ్గురూ కలిసి కాషాయం పార్టీపై ముప్పేట దాడి చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలను మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ బాగా వాడుకుంది. కాంగ్రెస్‌కు మంచి అవకాశాలే ఇచ్చి ఆ పార్టీతో కూడా బీజేపీని తిట్టించారు కేసిఆర్.
గత ఎన్నికల్లో సెంటిమెంట్‌ని అడ్డు పెట్టుకొని గెలిచిన కెసిఆర్‌కి ఈసారి మాత్రం గెలుపు కన్నా ముప్పేట దాడి నుంచి బయటపడటమే కష్టంగా ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ఎంఐఎంతోపాటు కమ్యూనిస్టులతోనూ దోస్తీ చేస్తున్నారని చెబుతున్నారు విశ్లేషకులు.