ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు- రేపు విచారణకు ఢిల్లీ రావాలని పిలుపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం. పిళ్లైను అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 9న(గురువారం) విచారణకు రావాలని పేర్కొంది. ఇప్పటికే కవితను ఇదే కేసులో సీబీఐ ఓసారి విచారించింది. ఇప్పుడు ఈడీ విచారణ చేయనుంది. హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను మంగళవారం సుదీర్ఘంగా విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాత్రి అరెస్టును ప్రకటించింది. ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఆయనపై వేసిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పెద్ద ఆరోపణలే చేశారు.
పిళ్లై ఏకంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని అభియోగించింది.
పిళ్లైను అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే కవితికు నోటీసులు రావడం సంచలనంగా మారింది. ఈ మధ్యకాలంలోనే మీడియాతో మాట్లాడిన కవిత... తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని... కావాలనే తనను బీజేపీ టార్గెట్ చేసిందన్నారు. బీజేపీ అక్రమాలు ఎండగడుతున్న కేసీఆర్‌కు చెక్ చెప్పాలంటే కవితతోపాటు ఇతరులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతున్న తను ఇబ్బంది పెట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు పిళ్లై అరెస్టు చేసిన వెంటనే నోటీసులు రావడం సంచలనంగా మారుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ పార్లమెంట్ సెషన్స్‌లోనే ఆమోదించి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని పోరాటానికి కవిత సిద్ధమయ్యారు. 10వ తేదీని ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఒక్కరోజు దీక్షకు పిలుపునిచ్చారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న మహిళా నాయకులు, మహిళా సంఘాలను సమీకరిస్తున్నారు. ఈ టైంలో నోటీసులు రావడం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి చాలా మందిని సీబీఐ, ఈడీ విచారించింది. . చాలా ప్రాంతాల్లో సోదాలు చేసింది. కవితను కూడా ఓసారి సీబీఐ విచారించింది. ఇప్పుడు ఈడీ వంతు వచ్చింది. ఈ కేసులో ఇప్పటికి 11 మంది అరెస్టు అయ్యారు.
నిన్న రాత్రి పిళ్లై అరెస్టు
పిళ్లైను మంగళవారం (మార్చి 7) అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఢిల్లీలోని స్పెషల్ కోర్టులో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. సౌత్ గ్రూప్‌లో పార్టనర్స్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా మరికొంత మంది ఉన్నారని తెలిపార. దీనికి బయట ప్రతినిధులుగా పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
పిళ్లైకు వారం రోజుల కస్టడీ, కెమెరా ఎదుట విచారణకు ఆదేశం
అరుణ్ రామచంద్ర పిళ్లైకు (Arun Ramachandran Pillai) సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్ వారం రోజులపాటు ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఈ కేసులో మనీలాండరింగ్ నియంత్రణ చట్టం కింద అరుణ్‌రామచంద్ర పిళ్లైను ఈడీ ఇప్పటికే చాలాసార్లు విచారణ చేసింది. అయినా ఆయన విచారణకు సహకరించట్లేదని, నగదు లావాదేవీల వివరాలు రాబట్టడానికి కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు లాయర్లు కోర్టులో కోరారు. నిందితుడు సమీర్ మహేంద్రు, అరుణ్ పిళ్లై మధ్య నగదు లావాదేవీలు జరిగాయని వాదించారు. ఈ వ్యవహారంలో పిళ్లై, మరో నిందితుడు బుచ్చిబాబులను కూడా కలిపి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అయితే, అరుణ్ పిళ్లై తరఫు న్యాయవాదులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ఇప్పటివరకు 29 సార్లు ఈడీ, 10 సార్లు సీబీఐ అధికారులు విచారణ చేశారని, అయినా విచారణకు సహకరించలేదని అనడం ఏంటని ప్రశ్నించారు. చివరికి అరుణ్ రామచంద్ర పిళ్లైను కస్టడీకి ఇచ్చారు. పిళ్లైను కెమెరా ఎదుట విచారించాలని ఈడీని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేశారు.