Delhi Liquor Scam: ఈడీ దర్యాప్తుపై సుప్రీం కోర్టుకెళ్లిన కవిత- ఆఫీస్‌కు పిలిచి విచారించడంపై అభ్యంతరం
సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఇంటికి వెళ్లి విచారించాల్సి ఉందని... ఈడీ ఆఫీస్‌కు పిలవడంపై అభ్యంతరం తెలుపుతూ కవిత వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు దర్యాప్తు సంస్థల విచారణకు వెళ్లి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి దిగారు. ఈడీ తనకు ఇచ్చిన నోటీసులపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఒక మహిళు విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరలతో కలిసి విచారిస్తారని చెప్పారని... అక్కడ మాత్రం అలా చేయలేదన్నారు కవిత.
సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకాసం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి విచారించాల్సి ఉందని... ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం తెలుపుతూ కవిత వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే తనకు మార్చి 16న జరిగే విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. కానీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, ఈ పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు మాత్రం అంగీకరించలేదు. అనంతరం కేసును 24కు వాయిదా వేసింది.
కవిత వేసిన ఈ పిటిషన్‌లోనే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన ఫోన్ సీజ్ చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 12న కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఎనిమిది గంటల విచారణ తర్వాత సాయంత్రానికి కవితను ఇంటికి పంపించారు. ఉదయం పదకొండు గంటల సమయంలో ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవితను ఐదుగురు అధికారుల బృందం ప్రశ్నించింది.
విచారణ మధ్యలో కవిత ఫోన్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం విచారణకు వచ్చేటప్పుడు కవిత పోన్ తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఫోన్ ఉంచి వచ్చారు. అయితే విచారణలో ఫోన్ గురించి ఈడీ అధికారులు వాకబు చేశారు. తన వద్ద లేదని చెప్పడంతో వెంటనే తెప్పించాలని ఆదేశించారు. ఈడీ కార్యాలయం బయట ఎదురు చూస్తున్న కవిత డ్రైవర్‌కు సమాచారం పంపి.. ఆయనను నివాసానికి వెళ్లి ఫోన్ తీసుకు రావాలని పురమాయించారు. మధ్యాహ్నం సమయంలో కవిత డ్రైవర్ ఫోన్ తీసుకుని ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారులకు ఇచ్చారు. ఆ ఫోన్ ను ఈడీ అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మళ్లీ 16వ తేదీన రావాలని నోటీసులు ఇచ్చారు.