Nagam Janardhan Reddy: కాళేశ్వరంలో భారీ అవినీతి, తెలంగాణకు పట్టిన చీడ పురుగు ఆయన - కేసీఆర్‌పై నాగం సంచలన వ్యాఖ్యలు
Nagam Janardhan Reddy: సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
Nagam Janardhan Reddy: సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం (ఆగస్టు 17) ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఇకపై ఉంటానని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్‌లో ఎవరు పోటీ చేస్తారన్నది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్‌ను కాపాడుకున్నానని, 5 ఏళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టుకున్నట్లు చెప్పారు.
‘‘నాగర్ కర్నూల్‌లో ఎవరూ లేనప్పుడు ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నా. జూపల్లి, దామోదర్ రెడ్డి ఇప్పుడొచ్చి టికెట్ నాదేనంటున్నారు. దామోదర్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరలేదు. ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్‌లోకి వెళ్లరని గ్యారంటీ ఏంటి? అంటూ ప్రశ్నించారు. తాను కాంగ్రెస్‌లో సీనియర్ కాకపోయినా.. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌నేనని పేర్కొన్నారు. పార్టీలో తాను టికెట్ల కోసం ఎప్పుడూ అప్లికేషన్ పెట్టుకోలేదని తెలిపారు. అందరూ టికెట్ కోసం దరఖాస్తు పెడితే.. తాను కూడా దరఖాస్తు చేస్తానని నాగం అన్నారు.
అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నాగం విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. తనకు, గాంధీ భవన్‌కు దూరం పెరగలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి పనిలో అవినీతి జరిగిందని, సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్, కేటీఆర్‌లదే అందుకు బాధ్యత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై తాడో పేడో పేల్చుకోవాలని కాంగ్రెస్ ఎంపీలకు నాగం సూచించారు. కర్ణాటకలో 40 శాతం అవినీతి సంగతి పక్కన పెడితే తెలంగాణలో 70 శాతం కమీషన్లపై కాంగ్రెస్ పోరాటం చేయాలని కోరారు.
రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుని మౌనంగా ఉంటున్నాటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు చీడ పురుగుగా మారారని నాగం ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి బాధ్యుడు కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ఏసీబీ డీజీపీకి వివరాలు సమర్పిస్తామన్నారు. అవినీతికి కారణమైన మంత్రులు, అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, స్పెషల్ ఛీప్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను విచారణ చేయాలన్నారు. వారు చర్యలు తీసుకోకపోతే ఏసీబీ కోర్టుకు వెళ్తామన్నారు.
ప్రాజెక్టు నిర్మాణ రేట్లను సలహాదారులు నిర్ణయిస్తున్నారని, తాను ఈ విషయం చెబితే ఎవరూ నమ్మలేదన్నారు. కానీ కాగ్ సైతం తాను చెప్పిన విషయాలనే చెప్పిందన్నారు. తెలంగాణ వచ్చిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ ఒక్క టెండర్‌ను అయినా పరిశీలించారా అంటూ ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే టెండర్లపై కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తించిందన్నారు. మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి తెలంగాణకు క్యాన్సర్ కంటే ప్రమాదికారిగా మారారని నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. 2004లో సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసిన కృష్ణారెడ్డి ఇప్పుడు దేశంలోనే పెద్ద కాంట్రాక్టర్‌గా ఎలా ఎదిగారని ప్రశ్నించారు.
గాలి జనార్ధనరెడ్డి మాదిరి మెగా కృష్ణారెడ్డిని సైతం విడిచిపెట్టనని సవాల్ విసిరారు. కాళేశ్వరం డబ్బుతో మెగా కృష్ణారెడ్డి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. కృష్ణా నదీ జలాల అంశంలో తెలంగాణ ప్రమాదంలో పడటానికి సీఎం కేసీఆర్ కారణని విమర్శించారు. తెలంగాణ నిధుల లూటీని ఆపే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఇవ్వకుంటే తల నరుక్కుంటానని కేసీఆర్ చెప్పారని గుర్తు చేస్తూ కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు తల నరుకున్నారని ప్రశ్నించారు.