BC Reservation Bills: బీసీలకు రిజర్వేషన్లు పెంచే బిల్లులు ఆమోదించాలని గవర్నర్‌ను కోరిన కాంగ్రెస్, విపక్షాలు
Telangana Governor | స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు ప్రవేశపెట్టి పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయని ఆమోదం తెలపాలని గవర్నర్‌ను కోరారు.

Local Body Elections In Telangana | హైదరాబాద్: బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లులు శాసనసభలో ఆమోదం పొందాయని, వాటిని ఆమోదించాలని పలువురు నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. సోమవారం ఉదయం పీసీసీ చీఫ్, మంత్రులు, అఖిలపక్ష నేతలు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభలో ప్రవేశపెట్టిన పురపాలక, పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌజ్ పరిగణనలోకి తీసుకొని బిల్లులను ఆమోదించాలని గవర్నర్ ను కోరారు.
శాసనమండలిలో ఉదయం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, కెపి వివేకానంద గౌడ(బీఆర్ఎస్), సీపీఐ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారు. అంతకుముందు సోమవారం ఉదయం తెలంగాణ శాసనమండలిలో పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను ఆమోదించారు. ఓవైపు సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులపై చర్చ జరుగుతుంటే, మరోవైపై కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.
కాళేశ్వరం కేసు ఇప్పుడు సిబిఐ కోర్టులో ఉంది
తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు ఇప్పుడు సీబీఐ కోర్టులో ఉందని.. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల పాత్రపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం అవినీతి అంశం ప్రస్తుతం సిబిఐ కోర్టు పరిధిలో ఉంది. ఈ విచారణ కొనసాగుతున్న క్రమంలో అన్ని పార్టీలు న్యాయ ప్రక్రియను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీకి నిజాయితీని నిరూపించుకునే అవకాశం
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన అవినీతి ఏటీఎంగా బీజేపీ పేర్కొనడాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు బీజేపీకి తమ మాటలకు అర్థం చెప్పే అవకాశం ఉందన్నారు. బీజేపీ కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోందని గుర్తు చేస్తూ, ఇప్పుడు వారే దర్యాప్తు వేగవంతం చేయాలని కేంద్రానికి ఒత్తిడి చేయాలని మహేష్ గౌడ్ సూచించారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవడం అవసరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపరమైన బిల్లులకు బీఆర్‌ఎస్ కూడా బీజేపీ మాదిరిగానే అడ్డుపడుతుండటాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
పీసీ ఘోష్ నివేదిక కాళేశ్వరం అవినీతిపై స్పష్టత ఇచ్చిందని, దీనితో బీఆర్‌ఎస్ నేతల పాత్ర బహిరంగమైందని అన్నారు. సీబీఐకి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రులు స్వయంగా బాధ్యత తీసుకోవాలి. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సీబీఐ దర్యాప్తును ఆమోదించారని తెలిపారు. అందువల్ల ఇప్పుడు వారు ఆ దర్యాప్తును వేగవంతం చేయడానికి చొరవ చూపాలని మహేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతికి బీఆర్‌ఎస్ నాయకత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పీసీ ఘోష్ నివేదిక ద్వారా స్పష్టమయ్యిందని పేర్కొన్నారు.
సీబీఐకి ఇవ్వడానికి కారణం
ప్రతిపక్షాలు సిట్ లేదా సీఐడీ దర్యాప్తుపై విమర్శలు చేస్తాయని అంచనా వేసి, తెలంగాణ ప్రభుత్వం పారదర్శకత కోసం సీబీఐకి విచారణ అప్పగించినదని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ప్రజల సంక్షేమం కోసం పారదర్శక పాలన అందిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డు కడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం అంశంపై బీఆర్‌ఎస్ నేతలు హరీష్ రావు మరియు కేటీఆర్ అసత్యాలను ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని మహేష్ గౌడ్ విమర్శించారు.
అసెంబ్లీలో మద్దతిస్తూనే పార్లమెంటులో వెనకడుగు వేస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్
రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు తీసుకొచ్చిన బీసీ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పార్లమెంటులో మాత్రం దాని అనుకూలంగా నిలవడం లేదు. ఇది వారి దౌర్మార్గ రాజకీయం అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.






















