జూన్ 24, 30 మధ్య గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ- టైం ఫిక్స్ చేసిన సీఎం కేసీఆర్
వచ్చే నెల 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ పూర్తి చేయనన్నారు. 2,845 గ్రామాల్లో 4,01,405 ఎకరాలకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు
తెలంగాణలో జరిగే దశాబ్ధి అవతరణ వేడుకలపై సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్‌లతో సమీక్ష నిర్వహించారు. వేడుకల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత వ్యవసాయానికి జీవం పోయడమే ప్రథమ కర్తవ్యంగా పని చేశామన్నారు కేసీఆర్. అందుకోసం ముందు చెరవులు, విద్యుత్, సాగునీరు రంగాలని వృద్ధి పరిచామని తెలిపారు. ఆ కృషికి నేడు వస్తున్న పలితాలే న నిదర్శనమన్నారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే అత్యధిక పంట దిగుబడి వస్తుందన్నారు సీఎం. వాటిని కొనే విషయంలో ఎక్కడా మాట రానియొద్దన్నారు కేసీఆర్. మరోవైపు అకాల వర్షాలకు దొరక్కుండా ముందుగానే పంటలు వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నవంబర్ రెండో వారానికి యాసంగి వరినాట్లు పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. యాసంగి వరి ముందే నాటుకుంటే తాలు తక్కువ అవుతుందని.. మంచి దిగుబడి వస్తుందన్నారు.
ఈ సందర్భంగా గృహలక్ష్మి పథకం అమలుపై చర్చించారు. నియోజకవర్గానికి 3000 మంది చొప్పున అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఇంటి నిర్మాణం ఉన్న దశలను బట్టి లబ్ధిదారులకు డబ్బులు అందజేయాలన్నారు. సొంత స్థలం ఉంటే మొదటి దశలో లక్ష రూపాయలు ఇస్తారు. మరో దశలో ఇంకో లక్ష ఇస్తారు. ఆఖరి దశలో మూడో లక్ష ఇవ్వనున్నారు.
వేడుకల్లో భాగంగా వచ్చే నెల 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ పూర్తి చేయనన్నారు. 2,845 గ్రామాల్లో 4,01,405 ఎకరాలకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీన వల్ల లక్షా యాభైవేల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు.
పోడు భూములు అందుకన్న ప్రతి లబ్దిదారుడికి బ్యాంకు ఖాతా తెరవనున్నారు. ఈ ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా డబ్బులు జమ చేయనున్నారు 3.08 లక్షల మంది ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధును ఇవ్వనున్నారు.
విశ్వకర్మలాంటి బీసీలకు లక్షరూపాయల ఉచిత ఆర్థిక సాయం పథకానికి విధి విధానాలు రూపొందించాలని మంత్రి గంగుల కమాలకర్‌ను ఆదేశించారు. ఆయన ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేయమన్నారు. జూన్9న జరిగే సంబరాల్లో బీసీ ఎంబీసీ కులాలకు లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు.
దశాబ్ధి ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ప్రగతి నివేదిక పుస్తకాలు ముద్రించాలని సూచించారు. ఆయా రంగాల వారీగా డాక్యూమెంటరీలు సిద్ధమవుతున్నాయని వాటిని జిల్లాల్లో జరిగే ఉత్సవాల్లో ప్రదర్శించాలని సూచించారు. మూడు వారాల పాటు జరిగే ఈ అవతరణ వేడుకలను ఘనంగా జరిపేందుకు ఖర్చుల కోసం కలెక్టర్లకు 105 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు సీఎం.