Bhatti Vikramarka: కార్మికులను గాలికొదిలేసిన ప్రభుత్వం! కనీస వేతన బోర్డు సమీక్ష చేయలేదు - భట్టి ఫైర్
CLP Leader Bhatti Vikramarka: హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగులతో పార్టీ నేతలు సమావేశమయ్యారు.
CLP Leader Bhatti Vikramarka: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగులతో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికుల అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికులు, ఉద్యోగుల హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ నిర్వీర్యం చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కార్మికుల సంక్షేమం కోసం కనీస వేతన చట్టాన్ని తీసుకువచ్చామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో ఏర్పాటైన రాష్ట్రం తెలంగాణలో ఏదీ సరిగ్గా లేదన్నారు. కేసీఆర్ 9 ఏళ్లుగా సీఎంగా ఉన్నా.. కనీస వేతన బోర్డును సమీక్ష చేయకుండా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. పర్మినెంట్ ఉద్యోగులు మాత్రమే ఉంటారు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం ఉండదని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు జాబ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో కార్మికులు శ్రమ దోపిడీకి గురయ్యారని అభిప్రాయపడ్డారు. కార్మికులు ఇకనైనా తమ హక్కుల కోసం, న్యాయపరమైన వేతనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
నిర్మాణ సంస్థలు చెల్లించే సెస్ ను కార్మికల కోసం ఖర్చుపెట్టకుండా పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ అలీఖాన్, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial