ప్రాణహిత- చేవెళ్ల చేపట్టి ఉంటే, తెలంగాణలో తొలి మూడేళ్లలోనే నీళ్లు పారేవి: భట్టి విక్రమార్క
లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ శాంక్షన్ చేసేందుకు గద్దరన్నతో కలిసి ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ రావాలని.. వస్తే షాద్ నగర్ నియోజకవర్గంలోని మండలాలకు, రంగారెడ్డి జిల్లాలోని మండలాలకు, నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలరు తాగు, సాగు నీరు వస్తాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ రిజర్వాయర్ వల్ల బీడు భూములు సస్యశ్యామలమై.. జీవితాలు మారిపోతాయని రైతులు, ప్రజలు ఆకాంక్షగా ఎదురు చూస్తున్నారు. ప్రజాసంఘాలన్నీ కలిసి లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ కోసం మంత్రులను, ముఖ్యమంత్రులను కలిశారు. దీనిని శాంక్షన్ చేసేందుకు గద్దరన్నతో కలిసి ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
నినాదాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు హక్కులుగా మారిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అందుకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తోంది. దీనిని అర్థం చేసుకున్న ప్రజలు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో పొడవబోతున్నారు. కర్నాటకలో మొదలై కాంగ్రెస్ సునామీ మరికొద్ది నెలల్లో తెలంగాణను తాకబోతోంది. ఇక్కడనుంచి ఛత్తీస్ గఢ్ కు, అక్కడనుంచి రాజస్తాన్, ఢిల్లీని తాకుతుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలను తీసుకువస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే లక్ష్మిదేవి రిజర్వాయర్ ను వెంటనే ప్రారంభిస్తామని మాట ఇస్తున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో సంపద, భూమిని పేదలకు పంపిణీ చేయాలి.
నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్దకాలం అవుతున్నా.. నీళ్లు పారడం లేదు. నిధులున్నాయి.. నదుల్లో నీళ్లున్నాయి.. అయినా రిజర్వాయర్ కట్టడం లేదు. రిజర్వాయర్ కట్టడానికి ఇబ్బందిగా ఉన్నది ముఖ్యమంత్రికి ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన లేకపోవడమే. కాంగ్రెస్ ప్రభుత్వాలు, పాలకులు మాత్రమే ప్రజల కోరికలను, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పాలించారు. అందుల్లో జూరాల, కోయిల్ సాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు, కల్వకుర్తి లిఫ్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు వచ్చాయి. బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయన్నారు భట్టి విక్రమార్క.
ఆదిలాబాద్ నుంచి చూస్తున్నాను.. తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తీసుకువచ్చారు. ప్రాణహిత నదితో గ్రావిటీ ద్వారా నీళ్లను రంగారెడ్డి జిల్లా వరకూ తరలించే ప్రయత్నం చేపట్టారు. అందతా తెలంగాణ ప్రజల కోసమే చేపట్టింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆదిలాబద్ లోనూ, కరీంనగర్ జిల్లాలోనూ.. లేదా మరో చోట ఎక్కడా భూములు లేవు. తెలంగాణ బీడు భూములకు నీళ్లు పారించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టాం.
బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, జనగామ, వరంగల్, వర్ధన్నపేట, హుజూరాబాద్, జనగామ, స్టేషన్ ఘన్ పూర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్ , చేవెళ్ల, షాద్ నగర్, పరిగి నియోజకవర్గాల్లో తిరిగాను. వెళ్లిన ప్రతిచోటా.. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు అందరూ ఒక్కటే మాట చెప్పారు.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టి ఉంటే.. తెలంగాణ వచ్చిన తొలి మూడేళ్లలోనే నీళ్లు పారేవి.
రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును చంపేశారు!
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చంపేశారు. లక్షల కోట్లు ఖర్చు చేశాడు.. కానీ కొత్తగా ఒక్క ఎకరాకు ఒక్క నీళ్లు ఇచ్చింది లేదు. అసలు కాళేశ్వరం అంటే.. మనం వాగులమీద, వంకలమీద కట్టే చెక్ డ్యామ్ వంటిదే తప్ప మరొకటి కాదు. చెక్ డ్యాములకు కాలువలు ఉండవు.. కేవలం వరదనీరు భూమిలో ఇంకించి భూగర్బ జలాలు పెంచుకోవడం కోరకు ఉపయోపడపడతాయి. గోదావరి నదిమీద కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూడా అంతే అన్నారు భట్టి.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన శ్రీరాంసాగర్, మడ్ మానేరు, కాకతీయ కాలువ, శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మాత్రమే నీళ్లు అందుతున్నాయి. గోదావరి నదిపై అత్యంత ఎత్తులో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత నదిమీద ప్రాజెక్టు కట్టుకునే అవకాశం ఉన్నా.. 100 మీటర్ల కిందకు ప్రాజెక్టు కట్టి.. మనకు గోదావరి నీళ్లు రాకుండా చేశాడు. కృష్ణానదిపై కూడా కేసీఆర్ చేసింది ఇదే. ఎత్తయిన ప్రదేశంలో ఉండే జూరాల నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా తీసుకునే అవకాశం ఉన్నా.. శ్రీశైలం నుంచి కిందనుంచి పైకి లిఫ్ట్ చేసేలా పాలమూరు ప్రాజెక్టును డిజైన్ చేయడం అత్యంత దుర్మార్గం. గాదావరి, కృష్ణాలోనే నీళ్లు రాకుండా కేసీఆర్ చేసిన కుట్ర వల్లే తెలంగాణ నీటి కోసం ఇబ్బందులు పడుతోంది. రాష్ట్రం వచ్చి పదేళ్లవుతున్నా.. కొత్త ప్రాజెక్టులు కట్టుకోలేక పోయాం. నదుల్లో నీళ్లున్నాయి.. రాష్ట్రంలో నిధలున్నాయి. కానీ తెలంగాణ భూముల్లో మాత్రం నీరు పారడం లేదు. ఇప్పుడు నీళ్లకు అడ్డుపడింది.. అక్షరాలా కే చంద్రశేఖర్ రావే.
ఒక్క ఎకరానికి కూడా సాగునీళ్లు ఇవ్వలేదు
కృష్ణానదినుంచి ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ కొత్తగా ఒక్క ఎకరానికి కూడా సాగునీళ్లు ఇవ్వలేదు అన్నారు భట్టి విక్రమార్క. కల్తకుర్తి, కోయిల్ సాగర్, నెట్టుంపాడు, భీమా ప్రాజెక్టును కాంగ్రెస్ కట్టి.. పొలాలను కాలువల ద్వారా నీళ్లు అందించింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 నుంచి 4 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు అందించేలా కాంగ్రెస్ డిజైన్ చేసింది. పాలమూరు - రంగారెడ్డి విషయంలో ఇన్నేళ్లనుంచి ఏమైనా గాడిదలు కాస్తున్నావా? అదనపు ఆయకట్టుకు నీళ్లు అందితేనే బీడు భూములు సస్యశ్యామలంగా మారతాయి. లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ పూర్తి చేయకపోతే ఓట్లు అగడనని చెప్పావు. నీకు సిగ్గుంటే.. ఆ మీట మీదే నిలబడాలి. నువ్వుకానీ, నీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ ఇక్కడకు వచ్చి ఓట్లు అడగవద్దు. మాటలు చెప్పేనాయకులను ప్రజలను నమ్మే రోజులు పోయాయన్నారు.
జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం మేమే కట్టాము.. ఇప్పుడు లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ మేమే కడతాము. బీడు భూములకు నీళ్లిస్తాం. భూమి కోసం పోరాటం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం టెన్నెన్సీ యాక్ట్ తెచ్చి భూమిమీద హక్కులు కల్పించాం. అదీ సరిపోదంటే ఆర్ఓఆర్ చట్టం తెచ్చాం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నక్సలైట్లను చర్చలకు పిలిచి... వారితో చర్చించి భూ పంపిణీపై కోనేరు రంగారావుకమిటీ వేసి.. 104 అంశాల్లో 94 అంశాలను అసెంబ్లీలో పెట్టి చట్టం చేశాం. భూ సంస్కరణలు తీసుకువచ్చి భూమి పంపిణీ చేశాం అన్నారు భట్టి విక్రమార్క.
కాంగ్రెస్ హామీలు ఇవే!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందకు రూ. 5లక్షలు ఇస్తాం. ఏకకాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా.. 9 రకాల వస్తువులను అందిస్తాం. ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ఇస్తాం. ఆరోగ్య శ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా.. దానిని రూ. 5 లక్షల వరకూ పెంచుతాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తాం. ప్రతి ఏడాది జాబ్ కేలండర్ ద్వారా నియామకాలు చేపడతాం. నిరుద్యోగ భృతి రూ. 4 వేలు ఇస్తాం.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ చల్లా నరసింహారెడ్డి, రాజు, వికారాబాద్ డీసీసీ టీ రామ్మోహన్ రెడ్డి, గద్దర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుశివసేనా రెడ్డి, ఓయూ జేఏసీ నాయకుడు విజయ్ కుమార్, రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మినారాయణ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి ఇతర నాయకులు పాల్గొన్నారు.