Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Hyderabad Latest News:తెలంగాణలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి చేరబోతోంది. ఆ దిశగా సర్వం సిద్దమైంది. ఆలయ అభివృద్దితోపాటు, ఆదాయం లెక్కలు పక్కాగా ఉంటాయా?

Hyderabad Latest News: పాతబస్తీలోని ఛార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ హిందువుకూ ఓ సెంటిమెంట్. మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటైన ఆలయం కావడం వల్లనో, లేక కోరిన కోర్కెలు తీర్చే మహిమగల దేవతగా పేరొందడం వల్లనో, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దర్శానికి నిత్యం భక్తులు భారీగా తరలివస్తుంటారు. అంతేకాదు బిజెపి కేంద్ర పెద్దలు అమిత్ షా, నడ్డా వంటి కీలక నేతలు సైతం హైదరాబాద్ వచ్చారంటే తప్పకుండా ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్లరు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం బిజెపి నేతలకు ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు ఇటీవల కాలంలో పొలిటికల్ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు, ప్రమాణాలకు భాగ్యలక్ష్మీ ఆలయం వేదికగా మారింది. అంతలా హిందువుల సెంటిమెంట్ ఈ ఆలయంతో పెనవేసుకుని ఉంది. హిందూ, ముస్లింల ఐక్యతతోపాటు, మత విధ్వేషాలు చెలరేగకుండా చూడాల్సిన సున్నితమైన ప్రదేశం కూడా ఈ భాగ్యలక్ష్మి ఆలయం. ఇంతలా ప్రధాన్యత ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం తాజాగా దేవాదాయశాఖ ఆధీనంలోకి వెళ్లనుంది. ఇకపై హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రైబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
భాగ్యలక్ష్మీ ఆలయ చరిత్ర గురించి మాట్లడుకుంటే..1960 సంవత్సరంలో చార్మినార్ వద్దనున్న ఈ అమ్మవారి ఆలయ పరిధిలో బస్సు ప్రమాదం జరగడంతో అమ్మవారి విగ్రహం కూలిపోయింది. స్థానిక భక్తులు విరాళాలు సేకరించి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించారు. అంతకుముందు పోచమ్మ పేరుతో ఉన్న అమ్మవారి పేరును అప్పటి నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారిగా మార్చారు. అలా నాటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే మహంత్ రామ్‌చంద్ర దాసు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్ మోహన్ దాసు అనే వ్యక్తిని పూజారిగా నియమించారు. టెంపుల్ ట్రస్టీ మీద గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు కారణంగా హెరిడెటరీ ట్రస్టీ ఆర్డర్స్‌తో ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ఆదాయాన్ని రాజ్ మోహన్‌దాసు ఒక్కరే అనుభవిస్తూ వచ్చారు. దీనిపై మహంత్ రామ్‌చంద్ర దాసు కుమార్తె భాగ్యలక్ష్మీ ఆలయం అజామాయిషీ చేస్తున్న వారిపై కోర్టును ఆశ్రయించారు. కోట్లాది రూపాయాల ఆలయ నిధులను ప్రస్తుత నిర్వహకులు దుర్వినియోగం చేస్తున్నట్టు సాక్షాధారాలను కూడా ట్రైబ్యూనల్ దృష్టికి తీసుకెళ్లడంతో భాగ్యలక్ష్మి ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని తాజాగా తీర్పు ఇచ్చినట్టు దేవాదాయశాఖ అధికార వర్గాల సమాచారం.
ప్రస్తుతం ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు, మహంత్ రామ్‌చంద్రదాసు నుంచి దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోనుంది. 1960 దశకం నుంచి వీరు ఆలయ నిర్వహణ భాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆలయానికి తక్షణమే ఈఓను నియమించి ఆలయంలో ఎటువంటి అవకతవకలులేకుండా , అభివృద్దిలో ముందుకు తీసుకు వెళ్ళాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కోర్టు విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ అయినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఇప్పటి వరకూ ఆలయ ఆదాయం, ఖర్చులు ఇతర వివరాలను సేకరించడంతోపాటు భక్తుల విరాళాలు, నిధుల దుర్వినియోగంపై విచారణ జరపడంతోపాటు, ఒకవేళ అవకతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని ట్రైబ్యునల్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
Also Read: హైదరాబాద్‌లో 120 దేశాల సుందరీమణులు - మే 7 నుంచి 31వరకు అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

