Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే.. రైల్వే లైన్ల అభివృద్ధి, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ అభివృద్ధి, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు కిషన్ రెడ్డి.
నిజాం వారసులు, రజాకార్లు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచుతున్నారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని... కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మార్పు వస్తుందని పునరుద్ఘాటించారు. చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... తీర్పు బీజేపీకి అనుకూలంగా ఉంటుందని జోస్యం చెప్పారు. వందల కోట్లు ఖర్చు పెట్టినా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలవలేదని... రాష్ట్రవ్యాప్తంగా అదే సీన్ రిపీట్ అవుతుందన్నారు.
బీజేపీపై ఎంత విషం చిమ్మినా వచ్చే ఎన్నికల ఫలితం మారదన్నారు కిషన్ రెడ్డి. కుటుంబ పార్టీలపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అభిప్రాయపడ్డారు. కుటుంబ పాలనకు వ్యతిరేకమైన బీజేపీకి ప్రజలు పట్టం కడతారన్నారు. కుటుంబ పార్టీలతో జరిగే నష్టాన్ని ప్రజల గమనించారని వివరించారు. బీజేపీ అధ్యక్షుడిగా ఎవరికైనా రెండుసార్లు మాత్రమే అవకాశం ఉంటుందని.. టీఆర్‌ఎస్‌లో మాత్రం సర్వాధికారం కేసీఆర్ ఫ్యామిలిదే అని విమర్శించారు. జేపీ నడ్డా, ప్రధాని మోదీ తర్వాత వారి స్థానంలో కుటుంబ సభ్యలు ఎవరూ అధికారంలోకి రారని... ఇలా చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని నిలదీశారు.
బీజేపీ గుజరాత్ పార్టీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని... దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ గుజరాత్ పార్టీ ఎలా అవుతుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నిజాలు చెబితే 1000 ముక్కలు అవుతారనే శాపం కేసీఆర్ ఫ్యామిలీకి ఉందని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. అందుకే వారు ఎప్పుడూ అబద్దాలే మాట్లాడుతుంటారని నిజాలు చెప్పడానికి భయపడుతుంటారన్నారు.
కేంద్రం డబ్బులు ఇవ్వకుండా తెలంగాణలో అభివృద్ధి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. గ్రామ పంచాయతీలకు ఎవరు ఎంత ఇచ్చారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు కిషన్ రెడ్డి. బస్తీ దవాఖానాల్లో కేంద్రం నిధులు లేవా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వలేదా అని అడిగారు కిషన్ రెడ్డి. పెట్రోల్, డీజిల్‌పై రూపాయి కూడా తగ్గించని టీఆర్‌ఎస్ తమపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన ఎరువుల కర్మాగారాన్ని శంకుస్థాపన మోదీ చేశారని.. ప్రారంభోత్సవం చేసింది కూడా మోదీ అన్నారు.
రెండు నెలల్లో సంచలనం సృష్టించే వార్త చెబుతానన్న కేసీఆర్ కామెంట్స్‌పై కూడా కిషన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో కూడా భూకంపాలు, ప్రళయాలు అంటూ చాలా డైలాగ్స్ చెప్పారని... ఇలాంటి వాటికి భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు కిషన్ రెడ్డి. రజాకార్ల వారసులు.. నిజాం వారసులు.. ఇద్దరూ కలిసి తెలంగాణను ముంచుతున్నారన్నారు. ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు పని చేస్తే... కేసీఆర్ నెలకు 18 గంటలే పని చేస్తూ విమర్శలతో కాలం గడుపుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే.. రైల్వే లైన్ల అభివృద్ధి, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ అభివృద్ధి, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. సచివాలయం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. తాము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదన్న కిషన్ రెడ్డి...సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెబుతున్నారని.. వాస్తవానికి స్విట్జర్లాండ్ అధికారులతో కేంద్రం ముందుగానే చర్చలు జరిపిందన్నారు కిషన్ రెడ్డి.