KTR Latest News: సున్నం చెరువు వద్ద హైడ్రా బాధితులకు టపాకాయలు పంచిన కేటీఆర్
KTR Diwali Celebrations | హైదరాబాద్ లోని సున్నం చెరువు ప్రాంతాన్ని కేటీఆర్ సందర్శించారు. హైడ్రా కూల్చివేతలతో ఇండ్లు కోల్పోయిన వారికి టపాకాయలు పంచారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ అన్నారు.

Hyderabad News | హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టించే ప్రభుత్వం అనుకున్నాం కానీ, ఇండ్లు కూలగొట్టే ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఒక్క పేదవాడికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హెల్ప్ చేయలేదని, ఫ్రీ బస్సు ఒక్కటి తెచ్చారు. కానీ దాని ప్రయోజనం ఎంత ఉందో ప్రజలకే బాగా తెలుసు అన్నారు. హైడ్రా (HYDRA) బాధితులతో కలిసి కేటీఆర్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కూకట్‌పల్లి సున్నం చెరువు హైడ్రా కూల్చివేతలలో ఇల్లు పోగొట్టుకున్న చిన్నారి వేదశ్రీకి దీపావళి సందర్భంగా స్వీట్లు, టపాకాయలు ఇచ్చారు. హైడ్రా కూల్చివేతల్లో ఇండ్లు కోల్పోయిన మరికొందరికి సైతం కేటీఆర్ క్రాకర్స్ ఇచ్చారు.
రెండేళ్ల తరువాత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం
కూకట్ పల్లి సున్నంచెరువు ప్రాంతానికి వెళ్లిన కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందర్నీ ఆగం చేసింది. ఇందిరమ్మ రాజ్యం అనే పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తారనుకుంటే ఉన్న ఇండ్లు కూల్చేశారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆటో సోదరులు, బిజినెస్ చేసేవాళ్లు ఆగమాగం. కరెంట్ బిల్లులొస్తున్నాయి. ప్రభుత్వం మీకు న్యాయం చేయకపోతే రెండేళ్ల తరువాత కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. హైడ్రా బాధితుల జాబితా రాసుకుంటాం. అందరికీ ఇండ్లు కట్టించి ఇస్తామని మాట ఇస్తున్న. మీరు ధైర్యంగా ఉండండి.
Live: హైడ్రా బాధితులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) October 20, 2025
📍సున్నం చెరువు, కూకట్‌పల్లి https://t.co/DYJLRczjMX
కాంగ్రెస్ ప్రభుత్వం నరకాసురుడు లాంటిదన్న కేటీఆర్
దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం నరకాసురుడు వంటిది. రెండేళ్ల తరువాత వీళ్లు ఇంటికే పరిమితం అవుతారు. మీ పిల్లలకు టపాకాయలు ఇచ్చేందుకు, మీతో కలిసి పండుగ జరుపుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చేందుకు వచ్చాను. అధైర్య పడొద్దు. ఎన్నికల వరకే మీకు ఈ ఇబ్బందులు. ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకునే పరిస్థితి తెలంగాణలో కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని’ కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం కాదు.. కటింగ్ మాస్టర్.. హరీష్ రావు సెటైర్లు
హైడ్రా వ్యవస్థ కేవలం పేదలను లక్ష్యంగా చేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌షా కోట్‌లో హైడ్రా మూసీ బాధితులతో కలిసి హరీష్ రావు దీపావళి జరుపుకున్నారు. మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం దారుణం అన్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం వారికి కంటి మీద కునుకు లేకుండా చేసిందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. అందుకే ఆయనను సీఎం కాదు కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, రైతులు, యువత సహ అన్నివర్గాల వారిని రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీష్ రావు ఆరోపించారు.






















