BRS Parliamentary Meetings: నేడు BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఫోకస్ అంతా దాని గురించే
BRS Parliamentary Meetings: ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశాలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ చర్చల్లో చాలా అంశాలే చర్చించే అవకాశం ఉంది.
BRS Parliamentary Meetings: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంటలకు ప్రగతి భవన్ లో భేటీ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులను కేసీఆర్.. మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. భోజనం అనంతరం సమావేశం జరుగుతుంది. జాతీయ పార్టీగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ అనుసరించాల్సి వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పోరాడుతూనే దేశ వ్యాప్త అంశాలపై కూడా స్పందించే విధంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
ఫిబ్రవరి ఒకటవ తేదీన బడ్జెట్ సమర్పణ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశ పెడతారు. రెండో రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన 2023 కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. బడ్జెట్ ముద్రణ ప్రతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరినీ అనుమతించలేదు. బడ్జెట్ సమర్పించడానికి పది రోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్ మెంట్ లో జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండి పోతారు. ఈ ముద్రణ మొదలు కావడానికి భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. దీన్ని ఆర్థిక మంత్రి సమక్షంలో సిబ్బందికి పంచుతారు.
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరణ
కార్మిక సంఘాలు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ముందుకు వెళ్తున్న మోదీ ప్రభుత్వం.. ఎన్నికల బడ్జెట్ లో ఆ దూకుడును కొనసాగించకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరించే లక్ష్యాన్ని ఈసారి రూ.40 వేల కోట్లకే పరిమతం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గత బడ్జెట్ లో నిర్దేశించుకున్న లక్ష్యానికి ఆమడ దూరంలో నిలవడం, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పెరుగుదల, ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం ఇందుకు కారణాలుగా అంచనా వేవస్తున్నారు.