Hyderabad New projects: హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టులకు బ్రేక్-ఖజానా ఖాళీ అవడమే కారణమా..?
హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టులకు బ్రేక్ పడింది. నిధుల కొరత కారణంగా... కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Break for New projects in Hyderabad: తెలంగాణ ఆర్థిక పరిస్థితి సరిగా లేవని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం... హైదరాబాద్‌లో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు బ్రేక్ వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే.. చివరి దశలో ఉన్న ప్రాజెక్టు పనులను మాత్రం పూర్తి చేయాలని ఆదేశించింది. చివరి దశలో ఉన్నవాటికే నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే.. మెట్రో రెండో దశ పనులు, మూసీ సుందరీకరణ పనులు మాత్రం ఆటంకం లేకుండా నిర్వహించాలని ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. పీపీపీ కింద లేదా రుణం తీసుకుని ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిచేయబోతోంది కాంగ్రెస్ సర్కార్. దీంతో మూడు,నాలుగు నెలల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని ఆరోపిస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని... ఆర్థిక శాఖపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఈ పరిస్థితుల్లో... ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీల అమలు కాంగ్రెస్‌కు కత్తి మీద సాములా మారింది. పార్లమెంట్ ఎన్నికలలోపు ఆ హామీలు చేయకపోతే... ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అలా జరగకుండా... ఇచ్చిన మాట ప్రకారం హామీల అమలుపై దృషిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు కావాల్సిన నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఆ పరిస్థితిలో... స్థానిక సంస్థల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ (GHMC), హెచ్‌ఎండీఏ (HMDA), జలమండలిలో దాదాపు 15వేల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మొదలుపెట్టాల్సి ఉంది. బల్దియా పరిధిలో సమగ్ర రోడ్ల అభివృద్ధి పథకం(SRDP) రెండో దశ కింద దాదాపు రూ.3వేల కోట్లతో కొత్తగా రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం చేయాల్సి ఉంది. మొదటి దశలో మరో రూ.2వేల కోట్లతో పనులు మొదలుపెట్టాలి. అయితే... వీటన్నింటికి నిధుల కొరత సమస్యగా మారింది. సంక్షేమ పథకాలే నిధులు సేకరించడం కష్టంగా మారిన పరిస్థితులు... కొత్త ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం ప్రశ్నార్థకమే. దీంతో ప్రభుత్వం... కొత్త ప్రాజెక్టులకు బ్రేక్ వేసింది. మొదటి దశలో చివరి దశకు వచ్చి ఆగిపోయిన వంతెనలతోపాటు మిగిలిన ప్రాజెక్టుకు కొంతమేర రుణం తీసుకుని పూర్తిచేయాలని నిర్ణయించారు.
ఇక... 30వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో దాదాపు 20వేల ఇళ్లకు... 60 నుంచి 70శాతం పనులు పూర్తయ్యాయి. మిగతావి పది నుంచి 20 శాతమే పూర్తయ్యాయి. అందులో 60శాతం పనులు దాటినవి మాత్రమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాలాల విస్తరణ, కొత్త నాలాల తవ్వకం వంటి ప్రాజెక్టుల్లో కొత్త పనులను ఇప్పటికే చేపట్టవద్దని అధికారులను ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో.... జలమండలిలో కూడా కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం కొన్నాళ్లు ఆగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా మురికివాడల శుద్ధి ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నారు. ప్రధాన పైపులైన్‌ను కలిపే రింగ్‌మెయిన్ ప్రాజెక్టు నిర్మాణం కొంత భాగం పూర్తిచేసి నిధుల కొరతతో నిలిపివేశారు. దీని పూర్తికి మరో రూ.3 వేల కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఇప్పట్లో ఇది మొదలయ్యే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. హెచ్‌ఎండీఏ (HMDA) దాదాపు రూ.5 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో భూములు అమ్మగా వచ్చిన నిధులతో పాటు సంస్థ ఖజానాలో ఉన్నవి కూడా ప్రభుత్వ ఖజానాలోకి జమచేశారు. ఇప్పుడీ ఆ సంస్థ ప్రాజెక్టులకూ నిధులిచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పనులపై మాత్రమే సర్కారు దృష్టి పెట్టనుంది. అవి మినహా... మిగిలిన కొత్త ప్రాజెక్టులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశమే లేదు.