ECIL Canteen: సిబ్బంది నిర్లక్ష్యం, ఈసీఐఎల్ క్యాంటీన్ పప్పులో పాము పిల్ల- అక్కడ ఇది మామూలేనట!
ECIL canteen Food: ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పులో నుండి పాము పిల్ల బయటపడడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
ECIL canteen Food: కుషాయిగూడ: తినే ఆహారంలో చిన్న రాయి వచ్చినా, ఏదైనా అనుమానస్పదంగా కనిపిస్తేనే కొందరు వాంతికి చేసుకుంటారు. ఈ విషయం తెలిస్తే షాకవుతారు. ప్రముఖ కంపెనీ ఈసీఐఎల్ క్యాంటీన్లో నిర్లక్ష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆహార పదార్థాలలో ఎలుకలు, జిల్ల పురుగులు, సిగరెట్లు, బీడీలు సహజమని ఉద్యోగులు చెప్పి వాపోతున్నారు. తాజాగా క్యాంటిన్ లోని పప్పులో పాము రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ నుండి వండిన వస్తువులను చర్లపల్లి లోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పులో నుండి పాము పిల్ల బయటపడడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బయటికి రాకుండా యజమాన్యం, సిబ్బంది జాగ్రత్త పడడంతో అప్పటికే భోజనాలు చేసి విషయం తెలుసుకున్న కొంతమంది ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఈ క్యాంటీన్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుత ఘటనే కాకుండా, గతంలో ఎలుకలు, బీడీలు, సిగరెట్టు, జిల్ల పురుగులు ఆహార పదార్థాలలో వస్తాయని నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఏది ఏమైనా వేల మందికి భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ అధికారులు ఉద్యోగులు ఆహార పదార్థాల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఉద్యోగులు కోరారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial