TS Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా- 8 బిల్లులు, 2 తీర్మానాలకు ఆమోదం
TS Assembly Session : తెలంగాణ వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 8 ఎనిమిది బిల్లులు ఆమోదం తెలిపామన్నారు.
TS Assembly Session : తెలంగాణ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసన సభ,శాసన మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా ముగిశాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు 11 గంటల పాటు, శాసన మండలి సమావేశాలు 11 గంటల 42 నిమిషాల పాటు సాగాయన్నారు. రెండు తీర్మానాలు, ఎనిమిది బిల్లులు సమావేశాల్లో సభ ఆమోదం పొందాయన్నారు. మూడు ముఖ్యమైన అంశాలపై స్వల్ప వ్యవధి చర్చలు జరిపామన్నారు. పేదలు, రైతులపై భారం మోపేలా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవ తీర్మానానికి సభ ఆమోదించిందన్నారు.
కొత్త పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం ఆ మహనీయుడి పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఏ శాసన సభ ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించి ఉండకపోవచ్చన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం అబలంభిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను సీఎం కేసీఆర్ సభలో అందరికీ అర్థమయ్యేలా వివరించారన్నారు. ఎఫ్ఆర్బీఎమ్ చట్టాన్ని ఇష్టానుసారంగా అమలు చేస్తున్న తీరును, ఏపీ పునర్విభజన చట్టంలో పొందు పరిచిన హామీల అమలులో కేంద్రం వైఫల్యంపై సభలో అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కక్ష పూరిత విధానాలను ఆర్థిక మంత్రి వివరించారన్నారు. సభా సంప్రదాయాలు ఎవరూ అగౌరవ పరిచినా స్పీకర్ ను కించపరిచినా ఊరుకునేది లేదన్నారు. ముందే సభ నుంచి సస్ఫెండ్ కావాలని ప్రణాళికతోనే ఈటెల రాజేందర్ సభకు వచ్చారని వారి వ్యవహార శైలితో అర్థమైందన్నారు. నిబంధనల మేరకే స్పీకర్ చర్యలు తీసుకున్నారు తప్ప రాజకీయ దురుద్దేశాలు లేవని మంత్రి స్పష్టం చేశారు.
ఎనిమిది బిల్లులకు ఆమోదం
ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లులను శాసససభలో ప్రవేశపెట్టారు. వీటికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు శాసనసభ ఆమోదంతో కావేరి, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిక్‌మార్ యూనివర్సిటీలకు అనుమతి లభించింది.
తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు
ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుతో ఏర్పడే కొత్త వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు అమలుచేయనున్నారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో 12 వర్సిటీలకు ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు చేసినట్లు అయింది. నియామకాల తర్వాత కూడా కోర్టు కేసులు వస్తున్నాయని, కోర్టు తీర్పుల వల్ల వర్సిటీల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. యూజీసీ నిబంధనలతో ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి నియామక బోర్డు ఛైర్మన్ గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఉంటారని, వైస్ ఛాన్స్ లర్లు కమిటీ ఛైర్మన్లుగా ఉంటారన్నారు. యునివర్సిటీల్లో మూడు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. శాసనసభలో మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లుపై మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు. వాహనాల అమ్మకాల్లో ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు వచ్చేలా చట్ట సవరణ చేశామని తెలిపారు. డీలర్ల రాయితీ నిలువరించేందుకు చట్టాన్ని సవరణ చేశామన్నారు. లారీల అంతర్రాష్ట్ర పన్నులపై ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. గ్రీన్ ట్యాక్స్ అనేది కేంద్రప్రభుత్వం తెచ్చిందన్నారు. ఈ చట్ట సవరణ వల్ల వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదన్నారు.