Mlc Kavita : పెద్దలకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ, పేదలకు మాత్రం పింఛన్ ఇవ్వకూడదా? - ఎమ్మెల్సీ కవిత
Mlc Kavita : పేదలకు ఉచితాలు ఆపేయాలన్న కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలకు రూ. 10 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు.
Mlc Kavita : బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యాపారస్తులకు లక్షల కోట్ల రుణమాఫీ చేసి, పేదలకు సంక్షేమ పథకాలు ఆపాలని కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సంక్షేమ పథకాలు ఆపేందుకు కుట్రలు పన్నుతూ, కోర్టులను కూడా ఉపయోగించుకుంటున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ తీరును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందని కవిత తెలిపారు.
65 లక్షణ రైతులకు రైతు బంధు
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. మరో 10 లక్షల మందికి పింఛన్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారన్నారు. 65 లక్షల రైతులకు రైతు బంధు, ప్రతి రంగంలో ఉన్న పేదవారికి ఉపయోగపడేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు ఆపేయాలా?
రైతు బంధు, గురుకుల విద్య చేపలు, గొర్రెల పంపకం, ఆసరా బీడీ పెన్షన్ల పథకాలు ఆపేయాలా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కేంద్రం తీరుపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఉచితం అంటే ప్రజలు పేదరికం నుంచి బయటపడాలని, పేద ప్రజల్లో అభ్యున్నతి రావాలని ప్రభుత్వం చేసే సాయమని కవిత తెలిపారు. సంక్షేమాన్ని, ఉచితాన్ని వేరుగా చూడాలని కేంద్రానికి ఎమ్మెల్సీ కవిత సూచించారు.
బ్యాంకులను దోచేసిన వాళ్లకు రుణమాఫీలు
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వ్యక్తులకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ చేసినట్లు కేంద్రమే పార్లమెంటులో ప్రకటించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పెద్దలకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ చేయాలి కానీ పేద ప్రజలకు పింఛన్ ఇవ్వొద్దా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల ప్రజలు కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని కవిత హెచ్చరించారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేశారన్నారు. ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సమీక్ష కోసం పంపిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఉచితాల కింద ఆపేస్తే, ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో మేధావులు ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
Also Read : Basara IIIT: ఆదివారం గవర్నర్ వెళ్లారు - సోమవారం నుంచి కరెంట్ కట్, అంధకారంలోనే బాసర ట్రిపుల్ ఐటీ
Also Read : Harish Rao Letter: వెంటనే 50 లక్షల వ్యాక్సిన్ లు పంపండి - కేంద్రానికి మంత్రి హరీష్ రావు లేఖ