TRS Paddy Issue : మోదీ కోటపై దాడి చేస్తాం- బీజేపీని తెలంగాణ నుంచి తరిమికొడతాం : జీవన్ రెడ్డి
Trs Paddy Issue : రైతులను కూడగట్టి దిల్లీని ముట్టడిస్తామని, మోదీ కోటపై దాడి చేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. 13 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన ఆర్థిక నేరగాళ్లను దేశం దాటించిన కేంద్రానికి రైతులకు రూ.13 వేల కోట్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.
Trs Paddy Issue : మోడీ కోటపై దాడి చేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శనివారం మాట్లాడిన ఆయన కేంద్రంతో చి"వరి"గింజ వరకూ కొనిపించి తీరుతామన్నారు. కొనే వరకు కొట్లాడుతామని, బీజేపీతో పొట్లాడుతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు బట్టేబాజ్, బ్రెయిన్ లెస్, బెవార్స్, బాండ్ పేపర్ -బీ-4 ఎంపీలని మండిపడ్డారు.
"మండుతున్న ఎండలకు బండి సంజయ్ దిమాక్ ఖరాబైంది. వెంటనే ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చాలి. పొంతన లేని మాటలు చెప్పుతుండు. ఆయన నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతుండు. వడ్లు కనిపించే బాధ్యత నాదే యాదగిలో కూడా వరి వేయమన్నాడు. తీరా యాసంగి పంట చేతికొచ్చేసరికి కేంద్రం కొనదు, రాష్ట్రమే కొనాలంటున్నాడు. అందుకే ఆయనను తొండి మాటల సంజయ్ అంటున్నాం. తలతిక్క సన్నాసి. పొంతన లేని ట్వీట్లతో రైతులను ఆగమాగం చేస్తుండు. అన్నంపెట్టే రైతన్నకు సున్నం పెడుతుండు. బండి సంజయ్ ఇప్పుడు కల్లాల దగ్గరకు పోతే రైతులు ఉరికించి కొడతారు. బండి సంజయ్ సిగ్గూఎగ్గూ లేకుండా సీఎం కేసీఆర్ ను దూషిస్తూ ఒక తొండి లెటర్ రాసిండు. ఆ లెటర్ చూస్తేనే అతడి మెదడు మోకాలిలో ఉందనిపించింది. బీజేపీకి, బండి సంజయ్ కు కేసీఆర్ ను అనే సీనుందా?" అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి బీజేపీ సామంతుడు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ సామంతుడుగా మారిండని జీవన్ రెడ్డి ఆరోపించారు. "సెక్షన్-8 గురించి మాట్లాడుతున్న రేవంత్ గతంలో చంద్రబాబుకు చెప్రాసిగా పనిచేస్తూ ఉద్యమ కారులపై గన్ను ఎక్కుపెట్టిన తుపాకి రాముడు. ఇప్పుడు బీజేపీకి వంత పాడుతుండు. రాహుల్ గాంధీ తెలంగాణ రైతుల వైపు నిలబడలేదు. ఈ డబుల్-ఆర్, బీజేపీ-ఆర్ ను తరిమితరిమికొడతం. టీఆర్ఎస్ తోనే రైతులకు న్యాయం జరుగుతుంది. వరస ఆందోళనలతో రైతులను ఏకం చేశాం. సోమవారం దిల్లీలో తేల్చుకుంటాం. నూకలు తినమని అవమానించిన పీయూష్ ఆయుష్ మూడింది. ఆయన గోయల్ కాదు గోల్ మాల్. తెలంగాణతో పెట్టుకున్న మోదీకి మూడింది" అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలుఏ గట్టు నుంటారో తేల్చుకోవాలన్నారు. రైతులతో పెట్టుకున్నోడు, కేసీఆర్ తో గోక్కున్నోడెవడూ బాగుపడలేదన్నారు. ఎర్ర జొన్న రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన కాంగ్రెస్ సర్వ నాశనమైందన్నారు.
బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొడతాం
2 కోట్ల50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటున్నారని జీవన్ రెడ్డి కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ 23 లక్షల కోట్లను ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకున్నదని ఆయన ఆరోపించారు.13 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన బ్యాంకు రుణాల ఎగవేత దారులను, వైట్ కాలర్ నేరస్తులను, అవినీతి పరులను దేశం దాటించిన నీచమైన చరిత్ర మోదీ ప్రభుత్వానిదని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పదేపదే పెంచి లక్షల కోట్లు దోచుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలుకు 13 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.10,000ల చొప్పున ఇప్పటికే 50 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.5 లక్షల చొప్పున చెల్లించే బీమా అమలు చేస్తున్నామన్నరు. ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు నీళ్లిచ్చే దిశగా కృషి చేశామన్నారు. బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని జీవన్ రెడ్డి అన్నారు.