Puvvada Ajay Kumar :మంత్రి పువ్వాడ అజయ్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు
Puvvada Ajay Kumar : మంత్రి పువ్వాడ అజయ్ కు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Puvvada Ajay Kumar : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. మమత మెడికల్ కాలేజీ ఛైర్మన్ హోదాలో పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మమత కాలేజీ యాజమాన్యం పీజీ వైద్య కోర్సులకు 2017 జీవో ప్రకారం పెంచిన ఫీజులు వసూలు చేసింది. 2016 జీవో ప్రకారం పాత ఫీజు తీసుకోవాలని వైద్య కళాశాలలకు గతేడాది హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాలేజీలు వసూలు చేసిన అధిక ఫీజులను విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. అయితే మమత మెడికల్ కాలేజీ తమకు ఇవ్వాల్సిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.
గతంలో ఫీజుల పెంపు జీవోలు కొట్టేసిన కోర్టు
ప్రైవేటు పీజీ, వైద్య, దంత కళాశాలల్లో 2017-2020 విద్యా సంవత్సరాలకు ఫీజులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో విడుదల చేసింది. ఈ జీవోను హైకోర్టు కొట్టివేసింది. 2017లో ప్రభుత్వం ఫీజులు పెంచుతూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020 విద్యా సంవత్సరాలకు ఫీజులు పెంచుతూ 2017 మే 9న ప్రభుత్వం జీవోలు జారీ చేసింది విషయం తెలిసిందే. వీటిని హైకోర్టు సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేసిన కోర్టు... ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఫీజులు పెంపు నిర్ణయం తీసుకుందని పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వ జీవోలు చట్టానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఫీజుల పెంపు జీవోలను కొట్టేస్తూ గత ఏడాది తీర్పు ఇచ్చింది. టీఏఎఫ్‌ఆర్సీ 2016-19కి ఖరారు చేసిన ఫీజులనే విద్యార్థుల నుంచి వసూలు చేయాలని కాలేజీలకు ధర్మాసనం తెలిపింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేసినట్లయితే వారికి తిరిగి చెల్లించాలని కాలేజీలను ఆదేశించింది. కోర్సు పూర్తి చేసిన పీజీ, వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇచ్చేయాలని కాలేజీలను కోర్టు అప్పట్లో ఆదేశించింది. టీఎఎఫ్‌ఆర్‌సీ సిఫార్సుల ప్రకారమే ఫీజులు ఉండాలంటూ ఉస్మానియా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, హెల్త్ కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్, తదితరులు వేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఫీజుల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని పీజీ మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని తెలిపింది. కోర్సు పూర్తి చేసినోళ్లకు సర్టిఫికెట్లు ఇచ్చేయాలని హైకోర్టు ఆదేశించింది.
2016-19 ఫీజులే
మైనార్టీ, నాన్ మైనార్టీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజుల్ని ఖరారు చేయాల్సిన ఫీజుల రెగ్యులేషన్ కమిటీ (FRC) ఒప్పుకోకపోయినా ప్రభుత్వం ఫీజులు పెంచేందుకు జీవోలు ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి. ఇస్లామిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ – పీఏ ఇనాందార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2007లో ఎఫ్‌ఆర్సీని ఏర్పాటుచేసింది. 2015లో ఏర్పాటైన ఎఫ్‌ఆర్సీ 2016-19 సంవత్సరాలకు ఫీజులను ఖరారు చేసింది. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కోరాయని, అప్పటి సీఎస్ ఫీజుల్ని పెంచాలంటూ ఎఫ్‌ఆర్సీకి లేఖ రాశారు. ఎఫ్ఆర్సీ ఫీజుల పెంపునకు అంగీకరించకపోయినా ఫీజుల్ని పెంచుతూ 2017 మే 9న 41, 43 నంబర్ జీవోలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ జీవోలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని హైకోర్టు గతంలో స్పష్టం చేసింది.