License Suspension : న్యూ ఇయర్ వేడుకల్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, 5819 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు!
License Suspension : న్యూ ఇయర్ వేడుకల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 5819 మంది వాహనదారుల లైసెన్సులు రద్దు చేసినట్లు తెలంగాణ రవాణా శాఖ తెలిపింది.
License Suspension : హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 5819 వాహనదారుల లైసెన్సులు సస్పెండ్ చేసింది. మద్యం సేవించి వాహనం నడిపిన కారణంగా వాహనదారుల లైసెన్సులు సస్పెన్షన్ చేసినట్లు ప్రకటించింది. నగరంలోని నార్త్ జోన్ లో 1103, సౌత్ జోన్ లో 1151, ఈస్ట్ జోన్ లో 510 , వెస్ట్ జోన్ లో 1345 మంది వాహనదారుల లైసెన్సులు సస్పెండ్ చేశారు. 2021 ఏడాదితో పోల్చుకుంటే
ఈ ఏడాదిలో 3,220 వాహనదారుల లైసెన్స్ అధికంగా లైసెన్సులు రద్దయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సంజీవ రెడ్డి నగర్ లో 73, పంజాగుట్టలో 51, బంజారా హిల్స్ లో 48, జూబ్లీహిల్స్ లో 49 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డ్రంకన్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. అయినా న్యూ ఇయర్ వేడుకల అనంతరం కొందరు రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
న్యూ ఇయర్ రోజే విషాదం
నూతన సంవత్సరం ప్రారంభం రోజే హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ మూడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న టీఎస్ 07 ఎక్స్ 5195 నంబర్ గల కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న డివైడర్ ను ఢీకొట్టి అదుపు తప్పింది. వెంటనే మరో రెండు కార్లను కూడా ఢీకొట్టింది. ఇదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీకొట్టగా.. వారు గాల్లోకి ఎగిరి పడ్డారు. కింద పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణం అయిన మణిపాల్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మద్యం తాగి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు పెయింటింగ్ పని చేసుకుంటూ బ్రతికే శ్రీనివాస్,ఈశ్వరి లుగా పోలీసులు గుర్తించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాయల్ టిఫిన్ సెంటర్ ఎదురుగా 25 మంది వరకు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా రోడ్డు లోతుగా ఉండడం కూడా ప్రమాదాలకు కారణం అని పోలీసులు భావిస్తున్నారు. కొత్తగా ఇటువైపు వచ్చే వారికి ఈ రోడ్డులో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు. కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా లేకపోవడం ప్రమాదాలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. కారు ఢీకొట్టడంతో హోటల్ ఫ్లెక్సీలు ఊడి పడిపోయాయి.