Hyderabad: తెలంగాణలో మరో కుంభకోణం? గిడ్డంగుల సంస్థలో రూ.కోట్లు కాజేసేందుకు కుట్ర!
గతంలో తెలుగు అకాడమీలో జరిగిన నిధుల కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారుల పాత్రనే ఇందులో కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు.
తెలంగాణలో నిధులకు సంబంధించి మరో భారీ కుంభకోణానికి కుట్ర జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర గోడౌన్ల సంస్థలో నిధులు కాజేసేందుకు యత్నించినట్లుగా తాజాగా బహిర్గతమైంది. తెలుగు అకాడమీలో జరిగిన నిధుల గోల్‌మాల్ వెనుక ఉన్న సూత్రధారుల పాత్రనే ఇందులో కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే, తెలుగు అకాడమీలో కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించగా, తాజాగా గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్లు కాజేసేందుకు పన్నాగం పన్నారు.
ఇలా వెలుగులోకి..
గిడ్డంగుల సంస్థ తమ నిధులను బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి సంవత్సరం కావడంతో విత్ డ్రా కోసం అధికారులు బ్యాంకును సంప్రదించారు. అయితే, సంస్థ అధికారులు బ్యాంకుకు ఇచ్చిన రశీదులు నకిలీవని సిబ్బంది తేల్చేశారు. దీంతో గిడ్డంగుల సంస్థ డిపాజిట్లను కాజేసేందుకు కుట్ర జరిగినట్లుగా వెలుగులోకి వచ్చింది.
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు
తెలంగాణ గిడ్డంగుల సంస్థకు వచ్చే మిగులు ఆదాయాన్ని కొన్ని బ్యాంకుల్లో గిడ్డంగుల సంస్థ పేరుపైనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కార్వాన్ ప్రాంతంలోని యూబీఐ, ఎస్పీఐ బ్యాంకుల్లో గతేడాది జనవరి 6న రూ.1.90 కోట్లు, 7న మరో 1.90 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఈ నెల 6, 7 తేదీలకు ఏడాది కావడంతో డిపాజిట్లను విత్ డ్రా చేసుకునేందుకు సంస్థ అధికారులు బ్యాంకును సంప్రదించారు. అయితే, అప్పడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన తాలూకు రశీదులు బ్యాంకు అధికారులకు చూపించగా అవి నకిలీవని బ్యాంకు తేల్చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆన్‌లైన్ వివరాలను బ్యాంకు అధికారులకు చూపించగా.. బ్యాంకు వారు నకిలీ రశీదు స్థానంలో మరో రశీదును అందించి, నిధులను సంస్థ ఖాతాలో వడ్డీతో కలిపి జమచేశారు.
Also Read: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
అదే బ్యాంకులో అకాడమీ గోల్‌మాల్
తెలుగు అకాడమీ నిధుల వ్యవహరం, గిడ్డంగుల సంస్థ వ్యవహారం రెండూ కార్వాన్ ఏరియాలోని యూనియన్ బ్యాంకులోనే జరగడంతో నిధుల గోల్‌మాల్‌లో గత అధికారి పాత్ర ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. గిడ్డంగుల సంస్థ బ్యాంకులో నగదును డిపాజిట్ చేసిన సమయంలో తెలుగు అకాడమీ నిధులను కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు అధికారే ఉండడం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
Also Read: ఇవాల్టి నుంచి ఆ సిమ్‌కార్డులు పని చేయవు.. మరి మీ మొబైల్ నెంబర్ ఆ లిస్ట్‌లో ఉందా